Begin typing your search above and press return to search.

సుప్రీం తాజా మాట‌తో చంద్రుళ్ల‌కు షాక్!

By:  Tupaki Desk   |   4 July 2018 7:55 AM GMT
సుప్రీం తాజా మాట‌తో చంద్రుళ్ల‌కు షాక్!
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాల మీద వివిధ కోర్టులు మొట్టికాయ‌లు వేయ‌టం కొత్తేం కాదు. తాజాగా అలాంటి ప‌రిస్థితే సుప్రీంకోర్టులో ఎదురైంది. చంద్రుళ్ల పేర్ల‌ను నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆ అర్థం వ‌చ్చేలా సుప్రీం చేసిన తాజా వ్యాఖ్య‌లు ఏపీ.. తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు ముంద‌స్తు హెచ్చ‌రిక‌లుగా భావించాల్సిందే. మా రాష్ట్రం.. మా డీజీపీ అంటే కుద‌ర‌ద‌ని.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న డీజీపీని నియ‌మించి.. రిటైర్మెంట్ కు ఒక‌ట్రెండు రోజులు ముందు పూర్తి స్థాయి డీజీపీ హోదా ఇచ్చి రెండేళ్ల పాటు కొన‌సాగించే ప్ర‌క్రియ‌కు చెక్ పెట్టే దిశ‌గా సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు చేసింది.

పోలీస్ బాస్ ల నియామ‌కంపై ప్ర‌కాశ్ సింగ్ కేసులో తామిచ్చిన ఆదేశాల్ని ప‌క్కాగా పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. తాజాగా సుప్రీం చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా.. జ‌స్టిస్ క‌న్విల్క‌ర్‌.. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని జారీ చేసింది. రాష్ట్ర డీజీపీల నియామ‌కం క‌చ్ఛితంగా యూపీఎస్సీ ద్వారానే జ‌ర‌గాలే త‌ప్పించి.. ఆయా రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకోలేవ‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ప్ర‌స్తుతం డీజీపీగా వ్య‌వ‌హ‌రించే వారి ప‌ద‌వీ కాలం ముగియ‌టానికి మూడు నెల‌ల ముందే త‌ప్ప‌నిస‌రిగా స‌ద‌రు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ పోస్టుకు అర్హులైన వారి పేర్ల‌ను యూపీఎస్సీకి పంపాల‌ని పేర్కొంది.

అందులో మెరిట్‌.. సీనియార్టీ ప్రాతిప‌దిక‌న ముగ్గురి పేర్ల‌ను ఎంపిక చేసి రాష్ట్రాల‌కు పంపితే.. ఆ ముగ్గురిలో ఒక‌రిని ఎంపిక చేసుకునే వీలు ఉంది. అలా అపాయింట్ అయిన డీజీపీ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుతో సంబంధం లేకుండా రెండేళ్లు అదే పోస్టులో కొన‌సాగుతార‌ని స్ప‌ష్టం చేసింది. క‌నీసం రెండేళ్ల స‌ర్వీస్ ఉన్న అధికారుల‌ను యూపీపీఎస్పీ త‌న జాబితాలో చేర్చాల‌ని స్ప‌ష్టం చేసింది.

డీజీపీల నియామ‌కం విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాలు త‌మ‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. మా డీజీపీని మేమే నియ‌మించుకుంటామ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇందులో భాగంగా సొంత చ‌ట్టాల్ని చేసుకున్నాయి. ఇలాంటి వేళ‌.. డీజీపీ నియామ‌కం పూర్తిగా యూపీపీఎస్పీ ద్వారానే జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేయ‌టం ద్వారా మార్గ‌ద‌ర్శ‌కాల్ని స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. మ‌రి.. ఇంత క్లియ‌ర్ గా సుప్రీం చెప్పిన త‌ర్వాత ఇద్ద‌రు చంద్రుళ్లు డీజీపీ నియామ‌కంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.