Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ లో ఫెయిల్.. బాబు కొత్త ఎత్తు

By:  Tupaki Desk   |   20 May 2019 6:01 AM GMT
ఎగ్జిట్ పోల్స్ లో ఫెయిల్.. బాబు కొత్త ఎత్తు
X
ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ సర్వేలన్నీ ఏపీలో వైసీపీదే అధికారం అన్నాయి. లగడపాటి సహా రెండు మూడు మాత్రమే టీడీపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో బాబులో అసహనం, ఆందోళన పెరిగినట్టు కనిపిస్తోంది. అందుకే తాజాగా కొత్త ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ చిత్తుగా ఓడుతుందని తెలిసొచ్చాక ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. ఈ ఉదయం టీడీపీ సీనియర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దని.. మనదే గెలుపు అని ధైర్యం చెప్పారట.. కానీ టీడీపీ నేతల్లో మాత్రం నెత్తురు చుక్క కనిపించలేదట..

ఇక ఓడిపోతామని దాదాపు ఖాయం చేసుకున్న బాబు.. తన ఓటమిని అంగీకరించకుండా ఢిల్లీ వేదికగా కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. రేపు లేదా ఎల్లుండి విపక్షాలతో కలిసి ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటించాలని ధర్నా చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ఈరోజు కోల్ కతా వెళ్లనున్నారు..అక్కడ మమతా బెనర్జీతో సమావేశమై.. ఆ తర్వాత ఢిల్లీ ప్రాంతీయ పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్టు సమాచారం.

కేంద్రంలో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని చెప్పిన నేపథ్యంలో అందంతా ఈవీఎం ట్యాంపరింగ్ అని చంద్రబాబు గోల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అందుకే కొత్తగా వీవీ ప్యాట్స్ లెక్కించాలని రేపు లేదా ఎల్లుండి ప్రతిపక్షాలతో కలిసి ధర్నాకు ప్లాన్ చేశారు. వాళ్లందరూ కలిసి వస్తే ధర్నాచేసి మోడీని ఎండగట్టాలని స్కెచ్ గీశారు.

అయితే నిండా మునిగాక చలి ఏంటి అన్న చందంగా బాబు పరిస్తితి తయారైంది. ఈవీఎంలలోని వీవీ ప్యాట్స్ లెక్కింపు పూర్తి స్థాయిలో సాధ్యంకాదని ఈసీ తెలుపడం.. సుప్రీం సరేనని పిటీషన్ కొట్టేయడంతో బాబు ఆందోళన అర్థం లేనిదిగా మారింది. ఇప్పుడు తన ఓటమిని కవర్ చేసేందుకు ఇలా వీవీప్యాట్స్ లెక్కించాలనే కొత్త డ్రామకు బాబు తెరతీయబోతున్నారని అర్థమవుతోంది.