Begin typing your search above and press return to search.

మాటల్లో చెబితే నమ్మరు.. కళ్లతో చూడండి బెజవాడలో ఉద్యోగుల ర్యాలీ

By:  Tupaki Desk   |   3 Feb 2022 8:30 AM GMT
మాటల్లో చెబితే నమ్మరు.. కళ్లతో చూడండి బెజవాడలో ఉద్యోగుల ర్యాలీ
X
మాటల్లో చెబితే.. అంత చెప్పారు.. ఇంత చెప్పారు. పచ్చ మీడియా మాదిరి తయారయ్యారా? చంద్రబాబుకు అమ్ముడుపోయారా? ఎంత కవరిచ్చారు? మరేం డీల్ చేసుకున్నారు? ఇలాంటి దరిద్రపు గొట్టు మాటలు చాలానే వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. గతంలో ఉన్న నమ్మకం.. సోషల్ మీడియా తూట్లు పొడిచేయటమే కాదు.. కొత్త అనుమానాల్ని.. సరికొత్త సందేహాల్ని తీసుకొచ్చింది. కళ్లతో చూసి.. చెవులతో విన్నప్పటికీ ఏదో ఒక సందేహాం మనసును వెంటాడే పాడు రోజులు వచ్చేశాయి.

ఇలాంటి వేళ.. సామాన్యుడి కడుపుమంట.. ప్రభుత్వ విధానాలపై వారిలో ఉన్న వ్యతిరేకత ఎంతన్న విషయాన్ని చాటి చెప్పే నిరసన ర్యాలీ తాజాగా విజయవాడలో జరుగుతోంది. ఆంధ్రోడు లేవడు.. లేస్తే.. ఇక అగడన్న మాట వినటమే తప్పించి.. ఇటీవల కాలంలో చూసింది లేదు. తెలంగాణ పౌర సమాజానికి ఉన్న చైతన్యం ఆంధ్రోళ్లలో తక్కువని.. వారి చర్మం కాసింత దళసరిగా ఉంటుందని చెప్పే వారి కళ్లు తెరిచేలా ఈరోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ సత్తా ఏమిటో చాటారు.

జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన ఉద్యోగుల కారణంగా విజయవాడ జనసంద్రంగా మారింది.

గురువారం ఉదయం నుంచి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఎన్టీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్ టీఎస్ కూడలి వరకు ఉపాధ్యాయ.. కార్మిక సంఘాలు భారీగా నిరసన చేపట్టటం.. ఆయా రోడ్లు కిక్కిరిపోవటమే కాదు.. కరోనా వేళ.. తమ భయాల్ని పక్కన పెట్టేసి.. ప్రభుత్వ నిర్ణయం మీద తమకున్న నిరసనను తెలిపేందుకు దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఇసుక వేస్తే రాలనంతగా రోడ్లు కిక్కిరిపోయిన వైనానికి సంబంధించి మేం ఎంత చెప్పినా అతిశయోక్తిగా అనిపించొచ్చు. కానీ.. ఈ చిట్టి వీడియోలో ఉన్నది చూస్తే.. బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్రత ఎంతన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.