Begin typing your search above and press return to search.

కరోనా విషయంలో ఇలాంటి పిచ్చ పనులు మాత్రం చేయొద్దు

By:  Tupaki Desk   |   17 March 2020 12:30 PM GMT
కరోనా విషయంలో ఇలాంటి పిచ్చ పనులు మాత్రం చేయొద్దు
X
ప్రపంచానికి కరోనా వైరస్ కొత్త పాఠాల్ని నేర్పిస్తోంది. ఇంతకాలం ‘‘నేను బాగుండాలి. నా ఇల్లు బాగుండాలి’’ అని ప్రార్థించేవాళ్లు. ఇప్పుడు సీన్ మారిపోయింది. నేను కాదు నా పక్కనున్నోడు బాగుండాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఎందుకంటే.. కరోనాకు దూరంగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మన పక్కనున్నోడు.. మన ఎదుట ఉన్నోడు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే.. అవగాహన లేకుండా వ్యవహరించే కొందరి తీరు చూస్తే.. అవాక్కు కావటం ఖాయం. ఇలాంటి వారి తీరుతో కొత్త సమస్యలు రావటం ఖాయం. తాజాగా అలాంటి పనే చేసిన ఆగ్రాకు చెందిన వ్యక్తి మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీకి చెందిన ఒక మహిళకు ఇటీవల పెళ్లైంది. వారిద్దరూ కలిసి ఇటీవల హనీమూన్ కోసం ఇటలీ వెళ్లి వచ్చారు. భర్తకు బెంగళూరులో ఉద్యోగం. ఇటలీ నుంచి హ్యాపీగా వచ్చిన వారికి.. అనుకోని రీతిలో భర్తకు కరోనా ఉందని తేలింది. దీంతో.. ఐసోలేషన్ వార్డుకు తరలించి.. ప్రత్యేక చికిత్స చేయటం షురూ చేశారు. అదే సమయంలో.. సదరు మహిళను బెంగళూరులోని ఇల్లు దాటి వెళ్లొద్దని కోరారు. కానీ.. భయం వల్లో.. కరోనా విషయంలో అవగాహన లేకనో కానీ.. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమె ఫ్లైట్ లో ఢిల్లీ వరకూ వెళ్లి.. అక్కడ నుంచి అగ్రాకు రైల్లో తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు.

ఇంతా చేస్తే.. ఇప్పుడామె సైతం కరోనా బారిన పడినట్లుగా తేలింది. ఇప్పుడు సమస్య ఏమంటే.. బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానం లో.. అక్కడ నుంచి అగ్రాకు రైల్లో ప్రయాణించిన నేపథ్యంలో ఆమె ఎంత మందిని కలుసుకున్నారు? ఆమె ద్వారా ఎంతమందికి కరోనా వైరస్ బదిలీ అయి ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బెంగళూరులో మిస్ అయిన ఆమెను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆగ్రాలోని ఆమె ఇంటికి వెళితే.. తన కుమార్తె ఇంట్లో లేదని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇంట్లోనే సదరు మహిళ ఉందన్న విషయాన్ని గుర్తించి.. ఆమెకు పరీక్షలు జరిపారు. కరోనా పాజిటివ్ అని తేలటంలో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అదే సమయంలో.. కుమార్తెను ఇంట్లో ఉంచుకొని లేదని చెప్పిన సదరు తండ్రి మీద పలు సెక్షన్ల కింత కేసులు నమోదు చేశారు. కరోనా విషయంలో ఎవరికి వారు అప్రమత్తత ఎంత అవసరమో.. దాని బారిన పడిన వెంటనే.. అధికారులకు సమాచారం ఇచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. అందరూ కలిసి కట్టుగా పోరాడితేనే కరోనాను కట్టడి చేస్తామన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకు భిన్నంగా అగ్రా మహిళ తండ్రి మాదిరి పిచ్చ పనులు ఏ మాత్రం చేస్తే.. అందరికి ముప్పుగా మారటం ఖాయం.