Begin typing your search above and press return to search.

జగన్ అలిగినట్లున్నారు..

By:  Tupaki Desk   |   15 Oct 2015 11:09 AM GMT
జగన్ అలిగినట్లున్నారు..
X
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు అందరినీ ఆహ్వానించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం ఆ ఆహ్వానం తనకు పంపించొద్దని.... ఒకవేళ పంపించినా తాను రానని తెగేసి చెప్పేశారు. ''నాకు ఇన్విటేషన్ పంపించొద్దు... ఇచ్చినా నేను రాలేను.. ఆ తరువాత మళ్లీ నన్ను అనొద్దు'' అంటూ జగన్ గురువారం ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను ఎందుకు హాజరుకావడం లేదో వివరించారు. అందుకు ఆయన ఎనిమిది కారణాలు చెప్పారు.

పేదల భూములను చంద్రబాబు అత్తగారి సొమ్ములా లాక్కున్నారని ధ్వజమెత్తారు. మీ బినామీలతో రాజధాని చుట్టూ భూములను కొనిపించారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా రానని, అలాంటప్పుడు తన పైన మంత్రులతో విమర్శలు చేయించవద్దని చెప్పారు. కాగా, లోటస్ పాండ్ నుంచి ఫ్యాక్స్ ద్వారా జగన్ ఈ బహిరంగ లేఖ పంపించారు. ఈ లేఖ అందినట్లుగా కూడా తెలుస్తోంది. చంద్రబాబు నిర్మిస్తున్నది ప్రజా రాజధాని కానేకాదని చెప్పిన జగన్... అమరావతి శంకుస్థాపనకుఅటెండు కాకపోవడానికి ఎనిమిది కారణాలు చెప్పారు.

జగన్ లేవనెత్తిన పాయింట్లివే..

- ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రైతుల భూములు లాక్కొని రాజధాని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడ మీద కత్తిపెట్టి లాక్కున్న చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేం పలు సందర్భాలలో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా తీరు మారలేదు. అందుకే రాదల్చుకోలేదని జగన్ ఆ లేఖలో రాశారు.

- రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144ను ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరి ఎందుకు ఈ సెక్షన్లు అమలులో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు?

- . గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండింటినీ లెక్క చేయని మీ వైఖరికి నిరసనగా రాదల్చుకోలేదు.

- భూములన్నీ మీ అత్తగారి సొత్తు అన్నట్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసనగా రాదల్చుకోలేదు.

- నచ్చిన ప్రయివేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లు భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా, మీరు చేస్తున్న ఈ స్కాంలో మీకు మద్దతు తెలపకూడదన్న భావనతో రాదల్చుకోలేదు.

- కేంద్రం రూ.1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగ్ రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఏపీకి ఇంకా చేస్తామని కూడా చెబుతోంది. ఈ డబ్బును ఖర్చు చేసి బిల్లులు పెట్టండి .

- మీ వాళ్లను బినామీలుగా పెట్టుకొని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలను కొనుగోలు చేయించి, వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా మేం రాదల్చుకోలేదు.

- ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసనగా రాదల్చుకోలేదు. అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

.. మరి చంద్రబాబు దీనిపై ఏం చేస్తారో చూడాలి. మర్యాదపూర్వకంగా అందరితో పాటు జగన్ కూ ఇన్విటేషన్ ఇస్తారో... లేదంటే రానని తెగేసి చెప్పేసినందుకు ఇవ్వడం మానేస్తారో చూడాలి.