Begin typing your search above and press return to search.

మాస్ కాపీయింగ్ లో టీచర్లదే కీలక పాత్రా ?

By:  Tupaki Desk   |   3 May 2022 7:30 AM GMT
మాస్ కాపీయింగ్ లో టీచర్లదే కీలక పాత్రా ?
X
జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజు ప్రశ్నపత్రం బయటకు వచ్చేస్తోంది. దీన్ని లీకేజీ అని ప్రతిపక్షాలంటుంటే కాదు కాదు కేవలం మాస్ కాపీయింగ్ మాత్రమే అని ప్రభుత్వం అంటోంది. ఏదేమైనా ప్రశ్నపత్రాలు బయటకు వచ్చేస్తున్నయాన్నది వాస్తవం.

దీనివల్ల జరుగుతున్నదేమంటే కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకునే విద్యార్థులు డిస్ట్రబ్ అవటం ఖాయం. అయితే ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్న విధానంపైనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటివరకు ప్రశ్నపత్రాల బయటకు వస్తున్నందుకు బాధ్యులుగా 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 34 మంది టీచర్లే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు కాకుండా ఒక హెడ్ మాస్టర్, నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.

ఒక్కసారి 12 మంది టీచర్లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అలాగే మధ్యలో అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు టీచర్ల చొప్పున పోలీసులు అరెస్టులు చేస్తునేవున్నారు. అలాగే సోమవారం మళ్ళీ మరో 8 మంది టీచర్లను అరెస్టు చేశారు.

పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దగ్గరనుండి ప్రశ్నపత్రం బయటకు రావటం లేదు. వివిధ స్కూళ్ళల్లో పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, కొన్నిచోట్ల హెడ్ మాస్టర్లు, వైస్ ప్రిన్సిపాల్ లాంటి వాళ్ళ ద్వారానే ప్రశ్నపత్రం బయటకు వచ్చేస్తోంది. పరీక్షల కేంద్రాలకు ప్రశ్నపత్రాలు వచ్చినపుడు 100 మంది పిల్లలు పరీక్షలు రాస్తుంటే సరిగ్గా 100 ప్రశ్నపత్రాలు మాత్రమే రావు. అంతకన్నా కొంచెం ఎక్కువే వస్తాయి.

అలా ఎక్కువ వచ్చిన ప్రశ్నపత్రాలు హెడ్ మాస్టర్ల దగ్గరో లేకపోతే కీలకంగా ఉండే టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆధీనంలోనో ఉంటాయి. మామూలుగా అలా మిగిలిగిన ప్రశ్నప్రతాలను లాకర్లలో భద్రపరచాలి. కానీ కొంతమంది మొబైల్లో ఫొటోలు తీసుకుని పద్దతి ప్రకారం బయటున్న టీచర్లకు అందిస్తున్నారు. వారిద్వారా ప్రశ్నపత్రాలు పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు అందుతోంది. ఏకంగా ఆన్సర్లే లోపలకు వెళుతున్నాయి. ఇందులో వాటర్ బాయ్ ల పాత్ర కీలకంగా ఉంటోంది.