Begin typing your search above and press return to search.

దేశం కోసం పోరాడే వారు ఇలా చేస్తారా?

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:04 AM GMT
దేశం కోసం పోరాడే వారు ఇలా చేస్తారా?
X
తాను కలలు కన్న తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయంలో విజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అందుకుతగ్గట్లుగా భారీ ప్రయోజనాన్ని పొందారని చెప్పాలి. ఉద్యమం చేసింది.. తెలంగాణ సాధన కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేసిన ఎందరో సొంత రాష్ట్రంలో అనామకులుగా మారిపోతే.. అప్పట్లో ఉద్యమానికి పెద్దగా దన్ను ఇవ్వని ఎందరో నేతలు.. ఈ రోజున ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తున్న వైనం తెలుగు వారందరికి తెలిసిన విషయమే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను చెప్పిన తెలంగాణను తన ప్రభుత్వ హయాంలో తయారు చేస్తానన్న కేసీఆర్ మాట ఎంత మేర నిజమైందన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు కొత్త రాగాన్ని కేసీఆర్ ఆలపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు దేశమే లక్ష్యంగా.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ఏ మాత్రం అవకాశం వచ్చినా దేశ ప్రధానమంత్రి పదవిని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటును దసరా రోజున ప్రకటిస్తున్నారు కేసీఆర్.

ఈ కీలక ప్రకటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలవనుంది టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడిచే పార్టీ ఆఫీసులో కూర్చొని జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేస్తామని.. దేశ పగ్గాల్ని అందుకోవటమే లక్ష్యంగా పని చేయనున్నట్లుగా చెప్పనున్నారు. దేశాన్ని ఏలటమే లక్ష్యమైనప్పుడు.. అందుకు తాను ప్రాతినిధ్యం వహించే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకటన కాకుండా.. జాతీయస్థాయిలో ప్రకటన చేసి ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది.

అయితే.. తనకు పట్టు.. బలం ఉన్న ప్రాంతం నుంచి పార్టీ ప్రకటన ఘనంగా చేపట్టొచ్చని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని చెబుతున్నారు. ఇక్కడి మీడియా ప్రతినిధులైతే అడగాల్సిన ప్రశ్నల్నే తప్పించి.. అనూహ్య ప్రశ్నలు వేసే వారు తక్కువ.

ఒకవేళ వేసినా.. వారిని ఎలా కంట్రోల్ చేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఇదే ప్రకటనను మరెక్కడైనా చేసి ఉంటే.. ఎదురయ్యే ఇబ్బందులు అన్నిఇన్ని కావు. అందుకే.. తన సొంత అడ్డా నుంచి దేశాన్ని ఏలేందుకు అవసరమైన కార్యాచరణను కేసీఆర్ ప్రకటించనున్నారు.

జాతీయ పార్టీని ఏర్పాటు చేసి.. జాతీయ ప్రయోజనాలే లక్ష్యమని చెప్పే అధినేత ఎవరైనా సొంత ఇలాకాలో కూర్చొని మాట్లాడటం.. కీలక ప్రకటన చేయటమా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే.. స్థానబలిమిని ప్రదర్శించే వీలున్నప్పుడు.. ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటే..

ఎంట్రీలో ఉండాల్సిన బ్యాంగ్ ఉండకపోతే.. నెగిటివ్ ప్రచారం మొదలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే.. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా.. తనకు అలవాటైన పిచ్ లోనే కీలక మ్యాచ్ ను ఆడాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.