Begin typing your search above and press return to search.

బాబు ఎన్టీయార్ అల్లుడు ఎలా అయ్యారో తెలుసా...?

By:  Tupaki Desk   |   9 Sep 2022 2:36 PM GMT
బాబు ఎన్టీయార్ అల్లుడు ఎలా అయ్యారో తెలుసా...?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికి 41 ఏళ్ళ క్రితం అంటే 1981 సెప్టెంబర్ 9న ఎన్టీయార్ మూడవ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. అంటే ఈ రోజు చంద్రబాబు పెళ్ళి రోజు. ఆయనకు ప్రముఖులు అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు. బాబుకు పెళ్ళి రోజు వేళ రాజకీయాలకు అతీతంగా గ్రీటింగ్స్ వచ్చిపడుతున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే బాబు ఎక్కడో చిత్తూరు జిల్లా వారు. రాజకీయాలలో ఉన్న వారు. అలాంటి ఆయనకు మద్రాస్ లో తీరిక లేకుండా సినిమాల్లో బిజీ హీరోగా నాడు ఉన్న ఎన్టీయార్ తో బంధం ఎలా కలిసింది అన్నదే ఆసక్తికరమైన విషయం. చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు చెందిన వారు. ఆయన కష్టపడి పీజీ దాకా చదివారు. విద్యార్ధి దశలోనే రాజకీయల మీద మక్కువ ఎక్కువ.

ఇక ఆయన కాంగ్రెస్ అనుబంధమైన ఎన్ఎస్ యూఐలో కీలకంగా ఉండేవారు. ఎస్వీ యూనివర్శిటీ విద్యార్ధి ఎన్నికల్లో కూడా తన ప్యానల్ ని ఆయన వ్యూహాలు వేసి మరీ గెలిపించుకుని లీడర్ షిప్ క్వాలిటీస్ నాడే చాటారు. ఇక నాడు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ లో యోధానుయోధులు ఉన్నారు. అయితే దేశంలో కాంగ్రెస్ అదే సమయంలో చీలిపోవడంతో ఇందిరాగాంధీ నుంచి సీనియర్లు వేరుపడి తమదే అసలైన కాంగ్రెస్ అని క్లెయిం చేయడంతో ఇందిర తన పేరిట కాంగ్రెస్ ఐ ని స్థాపించారు. అలా 1978 నాటికి ఏపీలో రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ పోటీలో ఉన్నాయి.

ఇక రెడ్డీ కాంగ్రెస్ లో తలపండిన కాంగ్రెస్ నేతలు ఉంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఐ కి అభ్యర్ధుల కొరత ఉంది. ఆ టైం లో చంద్రగిరి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలా ఆయనకు టికెట్ లభించడం కాంగ్రెస్ ఐ కి ఏపీ జనాల నుంచి అమితాదరణ దక్కడంతో బాబు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అలా ఎమ్మెల్యే అయిన బాబు 1980లో ముఖ్యమంత్రి అయిన టీ అంజయ్య క్యాబినేట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఆయన ఆ పదవిలో ఉండగా ఎన్టీయార్ పెద్ద కుమారుడు జయక్రిష్ణతో పరిచయాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో ఎన్టీయార్ కి ఉన్న సినిమా థియేటర్ల వ్యవహారం ఆయన చూసుకునేవారు. ఆ విధంగా జయక్రిష్ణతో పెరిగిన స్నేహమే ఎన్టీయార్ తో పరిచయం దాకా వెళ్ళింది. ఎన్టీయార్ అప్పట్లో నటించిన ఒక సినిమాకు చంద్రబాబు మంత్రిగా క్లాప్ కొట్టారు. ఆ సందర్భంగా
అన్న గారి కంట్లో పడి మెరిక లాంటి యువ నాయకుడు అన్న భావన కల్పించారు.

ఆ తరువాతనే అటూ ఇటూ కూడా సంప్రదింపులు మొదలై అది కాస్తా చంద్రబాబు పెళ్ళికి దారితీసింది. ఇక మద్రాస్ లో అంగరంగ వైభవంగా జరిగిన చంద్రబాబు పెళ్లికి సినీ రాజకీయ రంగ ప్రముఖులు అంతా వచ్చారు. ఎన్టీయార్ బాబుకు కట్నమెంత ఇచ్చారు అన్న దానికి ఆ తరువాత రోజుల్లో బాబే మీడియా ముఖంగా చెప్పిన మాటలు ఉన్నాయి. తనకు కట్నం వద్దు అని చెప్పానని, పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చేయమని కోరానని బాబు అప్పట్లో చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఎన్టీయార్ మెచ్చిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మీదటనే ఆయన ఇంటికి బాబు అల్లుడిగా వచ్చారు. ఇక 1982లో ఎన్టీయార్ పార్టీ పెట్టాక కూడా కాంగ్రెస్ లోనే బాబు ఉన్నారు. మామ మీదనే పోటీ చేస్తాను అని చెప్పారు, చివరికి టీడీపీ ప్రభంజనంలో 1983లో చంద్రగిరిలో బాబు టీడీపీ నుంచి పోటీ చేసిన మేడసాని వెంకటరామానాయుడు చేతిలో 17,429 భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.

ఆ మీదట ఆయన 1984లో టీడీపీలో చేరారు. ఇక టీడీపీలో చంద్రబాబు పాత్ర ఎంతటి కీలకంగా మారిందో చరిత్రలో ఉంది. ఎన్టీయార్ ని 1995లో గద్దె దించి బాబు సీఎం అయినా టీడీపీ అంతా వెంట నడచింది అంటే ఆయన నాయకత్వ లక్ష‌ణాలు ఏపాటివో అందరికీ అర్ధమైంది. మొత్తానికి చంద్రబాబు ఎన్టీయార్ ఇంటి అల్లుడు కావడానికి మాత్రం ఆయన నాయకత్వ లక్షణాలు, కాంగ్రెస్ మంత్రి పదవి బాగా ఉపయోగపడ్డాయనే అంతా అంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.