Begin typing your search above and press return to search.

అమెరికా వద్ద ఎన్ని అణు బాంబులు ఉన్నాయో తెలుసా ?

By:  Tupaki Desk   |   6 Oct 2021 12:35 PM GMT
అమెరికా వద్ద ఎన్ని అణు బాంబులు ఉన్నాయో తెలుసా ?
X
ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతుంది అమెరికా. ప్రపంచానికి పెద్దన్న పాత్ర వహిస్తూ అభివృద్ధి లో పరుగులు పెడుతుంది. ప్రపంచం లో శాంతి వర్ధిల్లేలా, ఏ దేశమూ మరొకరిపై ఆటం బాబులతో దాడికి పాల్పడకుండా ఉండేలా, భూమ్మీద అణ్వాయుధాల నియంత్రణ కోసం తీవ్రంగా పాటుపడుతోన్న అమెరికా ఆ దిశగా మరో సంచలన అడుగు వేసింది. అమెరికా ప్ర‌భుత్వం తమ దగ్గరున్న అణు బాంబుల సంఖ్య‌ను అధికారికంగా వెల్ల‌డించింది. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా జరిపే పోరులో పారద్శకత పాటించేందుకే బాంబుల లెక్కలు చెబుతున్నామని అమెరికా తెలిపింది.

గత నాలుగేళ్లలో అగ్రరాజ్యం తన దగ్గరున్న ఆటం బాబుల సంఖ్య‌ను ప్ర‌క‌టించ‌డం ఇదే తొలిసారి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అణ్వాయుధాల డేటా వెల్లడిపై ఆంక్షలు కొనసాగగా, జోబైడెన్ ఎన్నికైన తర్వాత సదరు ఆంక్షల్ని తొలగించి, పారద్శకతను ప్రదర్శిస్తున్నారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 30 నాటికి అమెరికా వ‌ద్ద మొత్తం 3,750 అణ్వాయుధాలు ఉన్న‌ట్లు ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది. చివరి సారిగా 2019తో బయటపెట్టిన లెక్కతో పోలిస్తే అణ్వాయుధాల సంఖ్య 55 త‌క్కువే అయినప్పటికీ, 2017తో పోల్చితే 72 వెపన్స్ పెరిగాయని అధికారులు చెప్పారు. 60వ దశకంలో రష్యాతో కోల్ వార్ నేపథ్యంలో అమెరికా భారీ ఎత్తున అణ్వాయుధాలను సమకూర్చుకుంది. ఒక‌ప్పుడు అమెరికా వ‌ద్ద అధికారికంగానే 31,255 అణుబాంబులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది.

అణ్వాయుధాల నియంత్రణపై రష్యా సహా వివిధ దేశాలతో ఒప్పందాల్లో భాగంగా అమెరికా తన సంపత్తిని తగ్గించుకుంది. ర‌ష్యాతో ఆయుధ నియంత్ర‌ణ‌పై చ‌ర్చలు నిర్వ‌హించినున్న నేప‌థ్యంలో బైడెన్ ప్ర‌భుత్వం తాజాగా అణుబాంబుల సంఖ్య‌ను ప్ర‌క‌టించింది. నిరాయుధీక‌ర‌ణ‌లో పార‌ద‌ర్శ‌క‌త అవ‌స‌ర‌మ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. తమ దగ్గర 3,750 అణుబాంబులు ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ, స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్ అధ్యయనాల ప్రకారం ఈ ఏడాది జ‌న‌వ‌రి నాటికి అమెరికా వ‌ద్ద 5,550 ఉన్నట్లు వెల్లడైంది.

అదే ర‌ష్యా వద్ద అమెరికా కంటే ఎక్కువగా 6255 అణ్వాయుధాలు, చైనా వ‌ద్ద 350, బ్రిట‌న్ వ‌ద్ద 225, ఫ్రాన్స్ 290 అణుబాంబులు ఉన్నట్లు స్టడీలో తేలింది. ఇక భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్ తదితర దేశాల వద్ద అంతా కలిపి 400 వరకు న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్ ఉన్న‌ట్లు స్టాక్ హోం పీస్ రీసెర్చ్ పేర్కొంది. ఇక,ఆటం బాంబులకు కేరాఫ్ గా ప్రాచుర్యం పొందిన ఉత్తర కొరియా వద్ద 67 నుంచి 116 అణుబాంబులు ఉన్నాయని, గట్టిగా పట్టిపట్టి లెక్కపెట్టినా కిమ్ జాంగ్ స్వాధీనంలోని అణ్వాయుధాల సంఖ్య 151 నుంచి 241లోపే ఉంటాయని పలు అంతర్జాతీయ సంస్థలు నివేదించాయి. తద్వారా అణు బాంబుల విషయంలో కిమ్ అమెరికా దరిదాపుల్లోకి కూడా రాలేడని మళ్లీ తేటతెల్లమైపోయింది.