Begin typing your search above and press return to search.

అర్జెంట్ గా ఏపీకి అవసరమైన అప్పు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Jan 2022 4:47 AM GMT
అర్జెంట్ గా ఏపీకి అవసరమైన అప్పు ఎంతో తెలుసా?
X
చాలామంది మద్యం.. మగువ..సిగిరెట్ లాంటివి వ్యసనాలుగా చెబుతుంటారు. కానీ.. వీటన్నింటికి మించిన వ్యసనం మరొకటి ఉంది. అదే.. అప్పు. అవసరమైనప్పుడు అప్పు చేయటం తప్పు కాదు. అప్పు చేయటం ఒక అలవాటుగా మారితేనే ఇబ్బంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఓవైపు ఎడాపెడా సంక్షేమ కార్యక్రమాలు.. మరోవైపు భారీగా అప్పులు చేయటం ఏపీకి మాత్రం సాధ్యమని చెప్పాలి.

ఇప్పటికే రాష్ట్రం చేసిన అప్పు కొండలా మారిన వేళ.. కొత్త అప్పు కోసం చేస్తున్న వినతులు విస్మయానికి గురి చేస్తున్నాయి. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఇంత భారీగా అప్పులు అడుగుతున్న పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన వేళలో ఏపీకి ఉన్న అప్పుకు మించి.. గడిచిన ఏడేళ్లలో భారీగా అప్పు చేసిన క్రెడిట్.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే చెల్లుతుంది. తాజాగా అధికారంలో ఉన్న వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో భారీగా అప్పులు చేస్తున్నారు. మౌలిక వసతులు.. ప్రాజెక్టుల మీద.. ఉద్యోగ కల్పన మీద.. పరిశ్రమల కోసం అప్పులు చేస్తే.. ఒక రోజు కాకుంటే మరో రోజు ప్రయోజనం కలుగుతుంది.

అందుకు భిన్నంగా సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా అప్పు చేయటం మాత్రం కచ్ఛితంగా వ్యసనమే అవుతుంది. ఇప్పటికే భారీగా అప్పు చేసిన జగన్ సర్కారు.. రాబోయే మూడు నెలలకు మరింత అప్పు అవసరమవుతుందని పేర్కొంటూ తాజాగా ఒకత్త వినతిని భారత రిజర్వు బ్యాంకును కోరుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి.. ఈ జనవరి నుంచి మార్చి (ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు)కి ఎంత అవసరమని లెక్కలు అడిగారు.

దీనికి స్పందించిన ఏపీ ప్రభుత్వం.. తమకు జనవరిలో రూ.5వేల కోట్లు.. ఫిబ్రవరిలో రూ.11వేల కోట్లు.. మార్చిలో రూ.7వేల కోట్లు అప్పు అవసరమని.. మొత్తంగా మూడు నెలలకు కలిపి రూ.23వేల కోట్లుగా లెక్క తేల్చారు. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసినట్లుగా కేంద్రం తేల్చిన వేళ.. ఇప్పుడు మళ్లీ భారీ అప్పు కోసం రిజర్వు బ్యాంకును కోరిన ఏపీ ప్రభుత్వానికి ఏమని సమాధానం ఇస్తారో చూడాలి. ఏమైనా.. ఇలా భారీగా చేసే అప్పులు.. చివరకు ఎక్కడి వరకు తీసుకెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.