Begin typing your search above and press return to search.

ఎనిమిదేళ్ల‌లో పోల‌వరానికి కేంద్రం ఇచ్చిన డ‌బ్బులు ఎన్నో తెలుసా?

By:  Tupaki Desk   |   23 July 2021 12:30 AM GMT
ఎనిమిదేళ్ల‌లో పోల‌వరానికి కేంద్రం ఇచ్చిన డ‌బ్బులు ఎన్నో తెలుసా?
X
పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో అవాంత‌రాల త‌ర్వాత మొద‌లైన ఈ ప్రాజెక్టును కేంద్రం విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చింది. జాతీయ‌ప్రాజెక్టుగా ప్ర‌క‌టించి, నిధులు విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. నిధులు విడుద‌ల చేస్తోంది కూడా! అయితే.. గ‌డిచిన ఎనిమిదేళ్ల‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన డ‌బ్బులు చూస్తే.. నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌దు.

రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌ణాళికాశాఖ మంత్రి ఇంద‌ర్ జిత్ సింగ్ గురువారం స‌మాధానం ఇచ్చారు. గ‌డిచిన 8 సంవ‌త్స‌రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పోలవ‌రం నిర్మాణానికి 11,182 కోట్లు ఇచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. అంటే.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చింది కేవ‌లం 11,182 కోట్లు అన్న‌మాట‌!

కానీ.. ప్రాజెక్టు నిర్మాణం, పున‌రావాసం క‌లిపితే పోలవ‌రానికి కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం డ‌బ్బులు 55,657 కోట్ల రూపాయ‌లు. కానీ.. ఎనిమిదేళ్ల‌లో స‌గ‌టున ఏడాదికి 1400 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం విడుద‌ల చేసింద‌న్నమాట‌. మ‌రి, ఈ లెక్క‌న మొత్తం నిధులు విడుద‌ల చేయ‌డానికి ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది? ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చ‌ట్టంలో పొందు ప‌రిచిన‌ప్ప‌టికీ.. దాన్ని అమలు చేయ‌కుండా చ‌ట్టాన్ని ఉల్ల‌ఘించిన కేంద్రం.. ఇప్పుడు పోల‌వ‌రం విష‌యంలోనూ తీవ్ర నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ నిధులే.. కేంద్రం చిత్తశుద్ధికి సాక్ష్యమని నిపుణులు, రాజకీయ నేతలు అంటున్నారు. మరి, రాబోయే కాలంలోనైనా పోలవరం నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యత జాబితాలో చేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.