Begin typing your search above and press return to search.

ఊహాతీతంః క‌రోనాపై దేశ ప్ర‌జ‌లు చేసిన‌ ఖ‌ర్చు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   21 July 2021 4:30 PM GMT
ఊహాతీతంః  క‌రోనాపై దేశ ప్ర‌జ‌లు చేసిన‌ ఖ‌ర్చు ఎంతో తెలుసా?
X
మ‌న‌దేశంపై క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో దాడిచేసిందో అందరికీ తెలిసిందే. ప్ర‌పంచంలో మ‌రే దేశంపైనా ఈ స్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేదు. అయితే.. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన‌వారితోపాటు ప‌డ‌నివారు కూడా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. ఎన్నో క‌ష్టాలు.. మ‌రెన్నో న‌ష్టాలు అనుభ‌వించారు.

ఆసుప‌త్రిలో ట్రీట్మెంట్ పేరుతో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఉన్న‌దంతా ఊడ్చి పెట్టారు. అప్పుల‌పాల‌య్యారు. అయితే.. అది ఎంత అన్న‌ది స్ప‌ష్టంగా ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఎవ‌రు ఎంత న‌ష్ట‌పోయారు.. అన్న‌ది వారికి మాత్ర‌మే తెలుసు. అయితే.. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో కొవిడ్ కార‌ణంగా దేశ ప్ర‌జ‌లు ఖ‌ర్చుపెట్టిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి.

క‌రోనా సెకండ్ వేవ్ దారుణంగా విజృంభిస్తున్న వేళ ఆసుప‌త్రుల్లో బెడ్లు ల‌భించ‌డమే గ‌గ‌నంగా మారిపోయిన ప‌రిస్థితి. ఒక ట్రీట్మెంట్ రోజుకు ల‌క్ష రూపాయ‌లు వ‌సూలు చేసిన ఆసుప‌త్రులు కూడా ఉన్నాయి. రెమ్ డెసివ‌ర్ వంటి మందులు దొర‌క్క ఎంతో మంది అవ‌స్థ‌లుప‌డ్డారు. ఇదే అద‌నుగా చూసి బ్లాక్ మార్కెట్లో ఊహించ‌ని రీతిలో ధ‌ర‌లు పెంచి అమ్మేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

సాధార‌ణంగా ఒక్క రెమ్ డెసివ‌ర్ సూది మందు మూడు వేల రూపాయ‌ల లోపు ఉంటుంది. కానీ.. అలాంటి మందును ఏకంగా 30 వేల రూపాయ‌ల‌కు అమ్మేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. క‌రోనాతో బాధ‌ప‌డే వ్య‌క్తుల‌కు ఈ మందును 6 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. రెమ్ డెసివ‌ర్ మందుకు సాధార‌ణంగా.. 18 వేలు ఖ‌ర్చు చేయాల్సి ఉండ‌గా.. ఏకంగా ల‌క్షా 80 వేలు ఖ‌ర్చు చేశారు.

ఇలా దాదాపు అంద‌రినీ నుంచీ వ‌సూలు చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ఒక్క రెమ్ డెసివ‌ర్ కే ఇంత మొత్తం ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తే.. మిగిలిన వైద్యానికి ఎంత ఖ‌ర్చు చేసి ఉంటారు? అనే ప్రశ్న వ‌చ్చింది. సాధార‌ణ జ‌నాలు ఇన్నాళ్లూ కూడ‌బెట్టుకున్న డ‌బ్బు మొత్తం ఆసుప‌త్రుల‌కు ఖ‌ర్చు చేశారు.

ఈ విష‌య‌మై ప‌బ్లిక్ హెల్త్ ఫౌండేష‌న్ ఇండియాతోపాటు అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబ‌ల్ హెల్త్ అనిస్టిట్యూట్ సంస్థ‌లు క‌లిసి ఈ స‌ర్వే నిర్వ‌హించాయి. క‌రోనా టెస్టులు, చికిత్స‌కు ప్ర‌జ‌లు చేసిన వ్య‌యంపై వివ‌రాలు సేక‌రించాయి. ఈ స‌ర్వే సేక‌రించిన వివ‌రాలు, వేసిన అంచ‌నా చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం ఖాయం. కేవ‌లం క‌రోనా చికిత్స కోసం భార‌త‌దేశంలోని ప్ర‌జ‌లు ఏకంగా 64,000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఈ స‌ర్వే తేల్చింది.

క‌రోనా చికిత్స కోసం వివిధ రాష్ట్రాలు విధించిన ధ‌ర‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే తాము ఈ నివేదిక సిద్ధం చేసిన‌ట్టు ఈ స‌ర్వే సంస్థ‌లు తెలిపాయి. అంతేకాకుండా.. అంతేకాకుండా.. ఆసుప‌త్రుల్లో చికిత్స‌కు చేసిన ఖ‌ర్చును మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకున్నామ‌ని, ఆసుప‌త్రుల్లోకి రానుపోనూ ఖ‌ర్చులు ప‌రిగ‌ణించ‌లేద‌ని కూడా తెలిపారు. ఇవ‌న్నీ క‌లిపితే.. మొత్తం ఖ‌ర్చు మ‌రింత‌గా పెరుగుతుంద‌ని వెల్ల‌డించాయి.

ఇంకా లోతుగా కూడా ఈ విష‌యంలో అధ్య‌య‌నం చేశారు నిర్వాహ‌కులు. నెల‌నెలా ఖ‌చ్చిత‌మైన వేత‌నం వ‌చ్చే వారు త‌మ ఆదాయంలో దాదాపు స‌గం వ‌ర‌కు ఐసీయూ చికిత్స కోసం ఖ‌ర్చు చేశార‌ని లెక్క గ‌ట్టారు. ఇక క్యాజువ‌ల్ వ‌ర్క‌ర్స్ అయితే.. త‌మ సంవ‌త్స‌రం ఆదాయంలో ఏకంగా 86 శాతాన్ని క‌రోనా చికిత్స‌కే ఖ‌ర్చు చేశారు. సొంతంగా ప‌నులు చేసుకునే వారు 66 శాతం క‌రోనాకు వెచ్చించార‌ని తెలిపారు.

వీళ్లంతా ఆసుప‌త్రుల్లో ఉన్న‌వారు. వీరుకాకుండా.. హోం ఐసోలేష‌న్లో ఉన్న‌వారు కూడా 43 శాతం ఖ‌ర్చు చేశార‌ని అంచ‌నా వేశారు. వీరు కాకుండా టెస్టులు చేయించుకున్న వారు కూడా భారీగానే ఖ‌ర్చు చేశార‌ని స‌ర్వే నిర్వాహ‌కులు తేల్చారు. అయితే.. ఈ స‌ర్వే వ‌దిలేసిన అన్ని ర‌కాల ఖ‌ర్చులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు లెక్క తేలుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.