Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సభ్యత్వం ఎంతో తెలుసా ?

By:  Tupaki Desk   |   16 April 2022 6:53 AM GMT
కాంగ్రెస్ సభ్యత్వం ఎంతో తెలుసా ?
X
దేశవ్యాప్తంగా దెబ్బతినేస్తున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని డిజిటల్ ఫార్మాట్ రూపంలో ముగించింది. 2.6 కోట్లమంది డిజిటల్ సభ్యత్వం ఇచ్చినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. పోయిన సంవత్సరం నవంబర్ 1వ తేదీన మొదలైన దేశవ్యాప్త డిజిటల్ సభ్యత్వ నమోదు శుక్రవారం ముగించింది. 2022-27 మధ్య కాగితంరూపంలో ఇచ్చే సభ్యత్వంతో పాటు డిజిటల్ రూపంలో కూడా సభ్యత్వం చేయాలని డిసైడ్ చేసింది. సభ్యత్వాల కోసమే పార్టీ ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయించింది.

పార్టీ చేసిన సభ్యత్వ నమోదుకు యువత నుండి పెద్దఎత్తున స్పందన కనబడిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాగితంరూపంలో చేస్తున్న సభ్యత్వాలు ఇంకా ప్రాసెస్ లో ఉన్నది.

ఈ రూపంలో వచ్చే సభ్యత్వాలు మరో 3 కోట్లదాకా ఉండచ్చని పార్టీ అంచనా వేస్తోంది. అంటే పార్టీ సభ్యత్వం సుమారు 5.6 కోట్లవరకు ఉండచ్చు. పార్టీ అధ్యక్షపదవి కోసం ఎన్నికలు ఆగష్టు 21-సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించే అవకాశం ఉంది.

అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వగానే అక్టోబర్లో ఏఐసీసీ ప్లీనరీ జరగబోతోంది. ఈ ప్లీనరీ సందర్భంలోనే సీడబ్ల్యూసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటివరకు అందిన సభ్యత్వాల్లో సగం తెలంగాణా, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళలోనే నమోదవ్వటం గమనార్హం. ఇదే సమయంలో మొత్తం సభ్యత్వాల్లో 12 శాతం మహారాష్ట్ర నుండే నమోదవ్వటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిందేమంటే పార్టీ పై జనాల్లో నమ్మకం ఉన్నా అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధి నాయకత్వంపైన నమ్మకం కనబడటంలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు సీరియస్ రాజకీయాలు చేయటంలేదని జనాలు అనుకుంటున్నట్లున్నారు. వీళ్ళద్దరిలో కూడా రాహుల్ పరిస్ధితి అయితే మరీ అన్యాయంగా తయారైంది.

రాహుల్ ఎప్పుడు దేశంలో ఉంటాడో ఎప్పుడు విదేశాలకు వెళిపోతాడో కూడా తెలీదు. దేశంలో ఉన్న సమయంలో కూడా జనాల్లోకి వెళ్ళి తన కెపాసిటీపై నమ్మకం కలిగించలేకపోతున్నారు. అందుకనే రాహుల్, ప్రియాంకలను కలిపి జనాలు తిరస్కరిస్తున్నారు. దీనికి ఈమధ్యనే జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలే ఉదాహరణ.