Begin typing your search above and press return to search.

అర్ ఎస్ ఎస్ గురించి అవాక్క‌య్యే నిజం

By:  Tupaki Desk   |   11 Dec 2015 3:24 PM GMT
అర్ ఎస్ ఎస్ గురించి అవాక్క‌య్యే నిజం
X
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ ఎస్‌ ఎస్‌)కు గురించి ఆ సంఘం ప్ర‌త్య‌ర్థులు అవాక్క‌య్యే నిజం వెలుగులోకి వ‌చ్చింది. ఆర్ ఎస్ ఎస్‌ కు చెందిన 3 వేల మంది అరుణాచల్‌ ప్రదేశ్‌ కార్యకర్తలు బీఫ్‌ ప్రియులేననే వార్త తాజాగా క‌ల‌కలం సృష్టిస్తోంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ అఖిల భారత ప్రచార్‌ ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య ఇటీవల ఆర్‌ ఎస్‌ ఎస్‌ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించార‌ని స‌ద‌రు వార్త‌ల సారంశం.

మూడు రోజుల పాటు అరుణాచల్‌లో పర్యటించిన అనంత‌రం వైద్య ఆర్ ఎస్ ఎస్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ...బీఫ్‌ తినేవారిని అడ్డుకోవడం ఆర్ ఎస్ ఎస్ పనికాదని చెప్పారు. కార్యకర్తలుగా ఎదిగే క్రమంలోనూ వారికి బీఫ్‌ ప్రస్తావన గురించి బోధనలుండవని చెప్పారు. 'భారత్‌ ను నెంబర్‌ వన్‌ దేశంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యం. ఆరెస్సెస్‌ మతోన్మాద సంఘం కాదు.. ఒక సామాజిక సంఘం' అని వైద్య తెలిపారు. బీఫ్‌ నిషేధించాలనడం తమ లక్ష్యం కాదని, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాత్రమే సంస్థ పోరాడుతోందని అయితే ప్రజల ఆహారపు అలవాట్లు ఆర్ ఎస్ ఎస్‌ కు అక్కర్లేదని వైద్య అన్నట్లుగా వార్త‌లు వెలువ‌డ్డాయి.

అయితే ఈ వార్త‌ల‌ను ఆర్ ఎస్ ఎస్ ప్ర‌తినిధులు ఖండించారు. త‌మ అంత‌ర్గ‌త స‌మావేశంలో అస్స‌లు ఏమాత్రం ప్ర‌స్తావ‌న‌కు రాని బీఫ్ అంశాన్ని పేర్కొంటూ ఆర్ ఎస్ ఎస్ అందుకు అంగీకారం తెలిపింద‌ని చెప్ప‌డం సంఘ్ వ్య‌తిరేక వాదుల కుట్ర అని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు లేని అల‌వాటును చెప్తూ 3000 కార్య‌క‌ర్త‌లు తింటున్నార‌ని చెప్ప‌డంలోనే దుష్ప్ర‌చారం స్థాయి అర్థ‌మ‌వుతోంద‌న్నారు. మొత్తంగా ... తెలంగాణ‌లో మొద‌లైన బీఫ్ ర‌చ్చ దేశ‌వ్యాప్తంగా కొన‌సాగ‌డం ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామ‌మే.