Begin typing your search above and press return to search.

ఉద్యోగుల జీతాలకు ఏపీ పెడుతున్న ఖర్చెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Feb 2022 5:55 AM GMT
ఉద్యోగుల జీతాలకు ఏపీ పెడుతున్న ఖర్చెంతో తెలుసా?
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తున్నారు. ఏపీ మంత్రులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చుపెడుతున్నామని అర్థం చేసుకొని సమ్మె విరమించాలని కోరారు. దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాలకు సమానంగా ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తోంది.

2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37458 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది 33102 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చు పెడుతోందని ఓ నివేదికలో తేలింది.

ప్రబుత్వ మొత్తం ఖర్చులో జీతాలు , పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన నివేదిక తెలిపింది. మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండగా.. ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా 36శాతం ఉంది.

పీఆర్సీని అమలు చేస్తే ఏపీపై 10వేల కోట్లకు పైగా భారం పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో 68340 కోట్లు ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా బడ్జెట్ లెక్క ప్రకారం నిరర్థక ఖర్చు కింద చూపిస్తారు. ఏమాత్రం తిరిగిరాని ఖర్చుల కింద 68వేల కోట్లను ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

పీఆర్సీ విషయంలో ఉద్యోగ నేతల డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గింది. లేదంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కొత్తగా పీఆర్సీ అమలు చేస్తే మరో 10వేల కోట్ల ఖర్చు కలుస్తుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అన్నీ కలుపుకుంటే 78వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కింద ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాలకు కూడా ప్రభుత్వం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏపీ ప్రభుత్వం 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52513 కోట్లు ఖర్చు చేశారని సీఎం జగన్ కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. తాజాగా 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67340 కోట్లకు చేరిందని వివరించారు.

దేశంలో ఉద్యోగుల జీతాలకు హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఖర్చు ఎక్కువగా ఉందని ఓ సర్వే తేల్చింది.