Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కంపెనీలు ఎగొట్టిన రుణాలు ఎంతో తెలుసా ?

By:  Tupaki Desk   |   16 Feb 2021 3:30 PM GMT
హైదరాబాద్ కంపెనీలు ఎగొట్టిన రుణాలు ఎంతో తెలుసా ?
X
పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం, అప్పుల క్రింద బ్యాంకుల్లో భారీ ఎత్తున ప్రజాధనాన్ని తీసుకుని ఎగొట్టడం ఇపుడు మామూలైపోయింది. ఒక్క హైదరాబాద్ లోని 524 కంపెనీల యాజమాన్యాలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగొట్టిన మొత్తం ఎంతో తెలుసా అక్షరాల రూ. లక్ష కోట్ల రూపాయలు. అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. దేశం మొత్తంమీద అప్పులు ఎగొట్టిన చిన్నా చితకా 2203 కంపెనీలు ఎగొట్టిన మొత్తం . 1.66 లక్షల కోట్లయితే ఒక్క హైదరాబాద్ లోని కంపెనీలే లక్ష కోట్లు ఎగొట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

తీసుకున్న అప్పులు ఎగొట్టడంలో తెలుగురాష్ట్రాల్లోని కంపెనీల యాజమాన్యాలు బాగా తెలివిమీరిపోయాయి. అప్పులు ఎగొట్టే కంపెనాల యాజమాన్యాల్లో చాలామందికి రాజకీయ పార్టీల అండ గట్టిగా ఉండటంతో బాకీలను రాబట్టుకోవటానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించటం లేదు. బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపి సుజనా చౌదరి దీనికి తాజా ఉదాహరణ. అలాగే మాజీ ఎంపి రాయపాటి చౌదరి కూడా వేలాది కోట్లు ఎగొట్టారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీలు గీతాంజలి జెమ్స్, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లాంటి అనేక కంపెనీలు బ్యాంకులను వేలాది కోట్లకు ముంచేసినట్లే అనుకోవాలి. వీళ్ళల్లో కొందరు విదేశాలకు పారిపోగా మరికొందరు అధికారపార్టీలతో అంటకాగుతున్నారు. దాంతో తీసుకున్న అప్పులను రాబట్టుకోవటం బ్యాంకులకు తలకు మించిన భారమవుతోంది.

మధ్య తరగతి జనాలు లేకపోతే రైతులు తీసుకున్న అప్పులు సకాలంలో కట్టలేమని చెబితే వాళ్ళ విషయంలో బ్యాంకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తాయో అందరు చూసిందే. అలాంటిది వందలు, వేలకోట్లరూపాయలను తీసుకుని ఎగొట్టే బడా కార్పొరేట్ వాళ్ళ విషయంలో మాత్రం బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి.