Begin typing your search above and press return to search.

ఉదయ్ పూర్ టైలర్ ను హతమార్చేందుకు వాడిన బైక్ నెంబరు తెలుసా?

By:  Tupaki Desk   |   2 July 2022 5:30 AM GMT
ఉదయ్ పూర్ టైలర్ ను హతమార్చేందుకు వాడిన బైక్ నెంబరు తెలుసా?
X
యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం ఉదయ్ పూర్ లో చోటు చేసుకోవటం తెలిసిందే. నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మద్దతు తెలిసిన టైలర్ కన్హయ్య లాల్ ను దారుణంగా హతమార్చిన వైనం గురించి తెలిసిందే. ఈ ఉదంతం జరిగిన తీరు.. అనంతరం బయటకు వచ్చిన వివరాల్ని చూసినప్పుడు..

ఈ దారుణ హత్యలో పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే. హత్య చేసిన నిందితులు.. తాము పారిపోవటానికి వాడిన బైక్ ఇప్పుడు కొత్త సందేహాలకు కారణంగా మారింది.

దీనికి కారణం బైక్ నెంబరే. హత్య అనంతరం నిందితులు పారిపోవటానికి ఉపయోగించిన బైక్ నెంబరు 2611. ముంబయి ఉగ్రదాడి జరిగిన తేదీని గుర్తు చేసేలా బైక్ నెంబరు ఉండటంతో ఒక్కసారి ఉలికిపాటుకు గురయ్యే పరిస్థితి. దేశం ఎదుర్కొన్న దారుణం ఉగ్రదాడి జరిగిన తేదీ (26/11)కి సమానంగా బైక్ నెంబరు ఉండటంతో.. ఈ హత్యకు ఉగ్రవాదులకు మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయా? నిందితులు ఈ బైక్ ద్వారా ఏదైనా సందేశాన్ని ఇచ్చారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరు గౌస్ మహ్మద్ కాగా మరొకరు రియాజ్ అఖ్తారీ. వీరిద్దరిలో ఒకరు కిరాణా దుకాణాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. హత్య అనంతరం వారు ఆర్ జే 27 ఏఎస్ 2611 నెంబరున్న బైక్ మీద పారిపోయారు. వీరిద్దరితో పాటు.. వారు ప్రయాణిస్తున్న బైక్ ను ధన్ మండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2013లో ఈ బైక్ ను రియాజ్ అఖ్తారీ కొన్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ నెంబరు కోసం రూ.5వేల ఖర్చు చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడినట్లు చెబుతున్నారు. మిగిలిన విషయాలు తెలుసుకోవటానికి ఈ నెంబరు ప్లేట్ సాయం చేస్తుందన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

రియాజ్ మనసులోని క్రిమినల్ ఆలోచనలకు ఈ నంబరు ప్లేట్ అద్దం పడుతుందని.. 2014లో ఇతను నేపాల్ కు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు పాక్ కు పలుమార్లు ఫోన్ కాల్స్ చేసినట్లుగా గుర్తించారు. ఇదంతా చూస్తే.. రియాజ్ గత చరిత్రను మరింత తవ్వి తీస్తే షాకింగ్ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.