Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కోసం జగన్ చేసిన త్యాగమేంటో తెలుసా...?

By:  Tupaki Desk   |   21 Dec 2022 11:30 AM GMT
వైఎస్సార్ కోసం జగన్ చేసిన త్యాగమేంటో తెలుసా...?
X
వైఎస్ జగన్ నిండు కుండలా ఉంటారు. ఒక విధంగా ఆయన అంతర్ముఖుడు అని చెప్పాలి. ఆయన గురించి అంతా అలా ఇలా అనుకోవడమే తప్ప ఆయన ఏమిటి అన్నది చాలా చాలా తక్కువ మందికి తెలుసు. జగన్ పదమూడేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. పాదయాత్ర చేసి జనాల దగ్గరకు చేరారు. పార్టీ 11 ఏళ్ళుగా నడుపుతున్నారు. నాయకులు అందరితోనూ మీటింగ్స్ పెడతారు. ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్ళుగా పాలన చేస్తున్నారు. మంత్రులు అధికారులతో ఆయన నిత్యం సమావేశాలు జరుపుతారు.

కానీ జగన్ గురించి చాలా తక్కువే అందరికీ తెలుసు. అలాంటి జగన్ గురించి అందరి కంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటే కచ్చితంగా ఆయన కన్న తల్లి వైఎస్ విజయమ్మకే. ఆమెను సోషల్ మీడియాలో జగన్ 50వ జన్మ దినం సందర్భంగా ఇంటర్వ్యూ చేసినపుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

జగన్ కి ఇష్టమైన పదార్ధం ఏంటి అంటే చికెన్ అని చెప్పారు విజయమ్మ. దాన్ని జగన్ చాలా ఎక్కువగా తింటారట. అయితే అంత ఇష్టమైన వంటకాన్ని జగన్ తన తండ్రి వైఎస్సార్ కోసం త్యాగం చేశారని మరో ఇంటరెస్టింగ్ న్యూస్ విజయమ్మ చెప్పుకొచ్చారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ మరుసటి ఏడాది అంటే 1996లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి.

ఆ టైంలో కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున వైఎస్సార్ మూడవసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. మొత్తం పోలీస్ బలగాలను మోహరించి లోక్ సభ పరిధి అంతా నింపేశారు. ఎలా వైఎస్సార్ గెలుస్తారో చూస్తామని కూడా టీడీపీ నేతలు సవాల్ చేసిన ఎన్నిక అది. ఇదిలా ఉంటే ఆ ఎన్నికల్లో వైఎస్సార్ ఓడిపోతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దాంతో జగన్ తన తండ్రి ఓటమి పాలు కాకూడని దేవుడిని ప్రార్ధిస్తూ వైఎస్సార్ గెలిస్తే తాను ఎంతో ఇష్టపడే చికెన్ ని త్యాగం చేస్తానని మొక్కుకున్నారంట. జీవిత కాలంలో తిరిగి చికెన్ ముట్టనని ఆయన దేవుడి ముందు ఒట్టేసుకున్నారుట.

మొత్తానికి ఆ ఎన్నికల్లో వైఎసార్ 5,500 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. అలా జగన్ తన చికెన్ ని జీవిత కాలం త్యాగం చేశారు. తాను ఎంతగానే ఇష్తపడే చికెన్ కి తండ్రి వైఎస్సార్ గెలుపుకు ముడిపెట్టి జగన్ కేవలం 24 ఏళ్ల వయసు నుంచి తినడం మానేసుకునారట. ఈ రోజున జగన్ 50వ బర్త్ డే. అంటే గత 26 ఏళ్ళుగా జగన్ చికెన్ ముట్టడం లేదు అన్న మాట. ఆ సంగతినే విజయమ్మ సోషల్ మీడియాతో పంచుకుని పట్టుదలకు జగన్ మారు పేరుగా చెప్పారు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తారు అని వెల్లడించారు.

జగన్ కి భయమంటే తెలియదు అని విజయమ్మ చెబుతూ జగన్ ఒక దాన్ని అనుకుంటే ఆయన చేసి తీరుతారు ఆ విషయంలో ఎందరి చెప్పినా వెనక్కి తగ్గే సమస్యే లేదని కూడా మరో విషయం చెప్పారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ ఏపీలో చాలా బాగా పాలిస్తునారని, నూటికి నూటాభై మార్కులు వేస్తానని విజయామ్మ చెప్పడం విశేషం. ఇక జగన్ ఓదార్పు యాత్ర ముందు వరకూ పార్టీ పెట్టాలని తాను సొంతంగా రాజకీయం చేయాలని ఉండేది కాదు అని చెప్పారు.

ఎపుడైతే కాంగ్రెస్ పెద్దలు అలా జగన్ని ఓదార్పు యాత్ర వద్దని వ్యవహరించారో నాటి నుంచే ఆయనలో పట్టుదల వచ్చిందని, జనాలు నీరాజనలు పడుతూ తమ వారిగా చేసుకోవడంతో అపుడే జగన్ నాయకుడు అయిపోయారని ఫ్లాష్ బ్యాక్ ని చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.