Begin typing your search above and press return to search.

ప్లీన‌రీ స‌మ‌యంలోనే మోడీకి కేసీఆర్ ఇచ్చే షాక్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   27 April 2022 7:30 AM GMT
ప్లీన‌రీ స‌మ‌యంలోనే మోడీకి కేసీఆర్ ఇచ్చే షాక్ ఏంటో తెలుసా?
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభ హైద‌రాబాద్ వేదిక‌గా అట్ట‌హాసంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, ఎనిమిదేళ్లు అధికార పార్టీగా ప్రజల కోసం చేసిన పనులను చెప్పుకునేందుకే ఈ సభ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైనా చర్చించి సభలో తీర్మానం చేయనున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో జ‌ర‌గ‌నున్న టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో ఉదయం 11 గంటలకు పార్టీ చీఫ్‌ కేసీఆర్‌.. జెండా ఆవిష్కరించి ప్రసంగిస్తారు. తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిని ఆమోదిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రతినిధుల సభ ముగుస్తుంది.

జాతీయ రాజకీయాలే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సంక్షోభంలోనూ 24 గంటల కరెంట్‌ సరఫరాను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ విధాన ప్రకటన చేయనున్నారు.

అయితే, ఇదే స‌మ‌యంలో ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. దీనికి కేసీఆర్ డుమ్మా కొట్ట‌నున్నారు!


ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రతలపై అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోడీ చర్చించనున్నారు. 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన నేప‌థ్యంలో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ప్రభుత్వాలతో చ‌ర్చించ‌నున్నారు.

ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్యకార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. బూస్టర్ డ్రైవ్, కరోనా ఆంక్షలు, నిబంధనలపై ప్రధాని ఆయా ప్ర‌భుత్వాల‌తో చ‌ర్చించ‌నున్నారు. ఇంత‌టి కీల‌క‌మైన స‌మావేశానికి సీఎం కేసీఆర్ గైర్హాజ‌రు కానున్నారు.