Begin typing your search above and press return to search.

వైజాగ్ కు అడ్డు పడుతున్నదేమిటో తెలుసా ?

By:  Tupaki Desk   |   15 Jun 2021 3:49 AM GMT
వైజాగ్ కు అడ్డు పడుతున్నదేమిటో తెలుసా ?
X
అమరావతి నుండి విశాఖపట్నంకు వెళ్ళిపోవటానికి ఒకే ఒక అంశంవల్లే జాప్యం జరుగుతోందని సమాచారం. అదేమిటంటే కర్నూలుకు హైకోర్టును తరలించటానికి రీ నోటిఫికేషన్ జారీలో జరుగుతున్న జాప్యమే కారణమట. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నపుడు అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తు అప్పట్లో కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా రాజకీయ పరిణామాల్లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.

మూడు రాజధానుల ప్రతిపాదనలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కూడా ఒకటి. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు. పరిపాలనా, శాసనరాజధానుల ఏర్పాటుకు కేంద్రానికి ఎలాంటి సంబంధంలేదు. అదిపూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమే కాబట్టి జగన్ ఇష్టప్రకారం జరిగిపోతుంది. అయితే హైకోర్టును మార్చటమన్నది రాష్ట్రప్రభుత్వం పరిధిలో లేదు.

ఇపుడు అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు మార్చాలంటే కేంద్రం రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. దీనికి సుప్రింకోర్టు కూడా ఆమోదం తెలపాల్సుంటుంది. ఒకసారి కేంద్రం రీ లొకేషన్ను ఆమోదిస్తే సుప్రింకోర్టు ఆమోదం దాదాపు లాంఛనమే అవుతుంది. అప్పుడు కేంద్రం హైకోర్టు రీ నోటిఫికేషన్ జారీచేస్తుంది. మొన్నటి రెండురోజుల ఢిల్లీ టూర్లో ఇదే విషయమై హోంశాఖ మంత్రి అమిత్ షాకు జగన్ గట్టిగా వివరించారని పార్టీ నేతలు చెప్పారు.

జగన్ ప్రతిపాదనకు అమిత్ కూడా కన్వీన్స్ అయినట్లు నేతలు చెబుతున్నారు. హోంశాఖ మంత్రి ఓకే అంటే మిగిలిందంతా లాంఛనమే అని అందరికీ తెలిసిందే. ఈనెలాఖరులోగా హోంశాఖ నుండి దీనికి సంబంధించిన ఫైల్ న్యాయశాఖ మంత్రికి వెళుతుందని నేతలు ఆశాభావంతో ఉన్నారు. జగన్ టూర్ తర్వాత ఫైలులో కదలిక వచ్చిందట. ఒకసారి హైకోర్టు రీ నోటిఫికేషన్ వచ్చేస్తే వెంటనే జగన్ వైజాగ్ కు మారిపోవటానికి రెడీగా ఉన్నారని నేతలు చెబుతున్నారు. చూద్దాం ఈ నెలాఖరులోగా ఏమి మార్పులు జరుగుతాయో.