Begin typing your search above and press return to search.

ఈసారి ఢిల్లీకి తనతో కేసీఆర్ ఎవరెవరిని తీసుకెళ్లారో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Dec 2022 4:39 AM GMT
ఈసారి ఢిల్లీకి తనతో కేసీఆర్ ఎవరెవరిని తీసుకెళ్లారో తెలుసా?
X
సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడేం చేయాలో.. ఏలా రియాక్టు కావాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయన చర్యలు.. చేతలు ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం మీద జోరుగా చర్చలు జరుగుతున్న వేళ హటాత్తుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నకేసీఆర్..

రాజధానికి వెళ్లటం.. అక్కడే ఉండటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన ఎవరిని కలిశారు? ఎవరితో భేటీ అయ్యారన్న విషయాలు పెద్దగా బయటకు రాలేదు. కొద్ది మంది నేతల్ని కలిసినా.. వారెవరూ తప్పనిసరిగా కలవాల్సిన వారు కాదనే మాట వినిపించింది అప్పట్లో. కేవలం వారిని కలవటం కోసమే అన్ని రోజులు హస్తినలో ఉన్నారా? అన్న ప్రశ్న కూడా పలువురి నోట వినిపించింది.

ఏం చేశారో? ఎందుకు హస్తినలో అన్ని రోజులు ఉన్నారో బయటకు తెలీకుండానే ఉండిపోయిన ఆయన.. ఆ ట్రిప్ లో తన వెంట కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను తన వెంట పెట్టుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. నిజానికి తన పిల్లల్ని ప్రత్యేక విమానంలో చాలా అరుదుగా తనతో పాటు తీసుకెళతారనే చెప్పాలి. ముఖ్యంగా కుమారుడు కేసీఆర్ తో కలిసి ఆయన చాలా చాలా తక్కువ సందర్భాల్లో కలిసి ప్రయాణిస్తారని చెబుతారు. ఒకసారి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానట్లుగా ఆయన లెక్కలు ఉంటాయి.

ఈ మధ్యన ఢిల్లీకి వెళ్లినప్పుడు వెంట పెట్టుకెళ్లిన కుమార్తె కవితను.. ఈసారి కూడా తన వెంట ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళతారన్న అంచనా వ్యక్తమైంది. అవన్నీతప్పుడు లెక్కలన్న విషయాన్నిస్పష్టం చేస్తూ.. ఆయన భిన్నంగా వ్యవహరించారు. తాను పెట్టిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయాన్నిఓపెన్ చేసేందుకు హస్తినకు బయలుదేరిన ఆయన వెంట ప్రత్యేక విమానంలో కుమారుడు, కుమార్తె లేరు. చివరకు మేనల్లుడు హరీశ్ కూడా లేరు.కానీ.. వీరికి భిన్నంగా ఆయన కొడుకు కొడుకు (మనమడు) హిమాన్షును వెంట పెట్టుకొని ఢిల్లీకి వెళ్లటం గమనార్హం.

మనమడు హిమాన్షుతో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో పదహారు మంది ఉన్నారు. వీరిలో మంత్రులు.. ఎంపీలు కూడా ఉండటం గమనార్హం. బుధవారం ప్రారంభించే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రోజున్నర ముందే ఢిల్లీకి చేరుకోవటం గమనార్హం.

ప్రస్తుతం ప్రారంభిస్తున్నది తాత్కాలిక పార్టీ ఆఫీసు. ఎందుకంటే తమ సొంత పార్టీ కార్యాలయాన్ని భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే.. తాజా పార్టీ ఆఫీసు ప్రారంభ కార్యక్రమాన్ని సింఫుల్ గా ముగించాలన్న ఉద్దేశంతో తక్కువ మందిని పిలిచినట్లుగా చెబుతున్నారు. ఏమైనా జాతీయపార్టీ ఆఫీసు కార్యాలయ ప్రారంభానికి మనమడ్ని వెంట పెట్టుకెళ్లటం ఆసక్తికరంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.