Begin typing your search above and press return to search.

కేసీఆర్ మా ఇంటికి ఎందుకొచ్చారో తెలుసా? - ఎమ్మెల్యే రోజా

By:  Tupaki Desk   |   9 July 2021 2:30 PM GMT
కేసీఆర్ మా ఇంటికి ఎందుకొచ్చారో తెలుసా? - ఎమ్మెల్యే రోజా
X
కేసీఆర్ - జ‌గ‌న్ రాజ‌కీయంగా ప‌క్కా అవ‌గాహ‌న‌తో ముందుకు సాగుతున్నార‌ని, వాళ్లు సాగిస్తున్న నీళ్ల పంచాయితీ కూడా డూబ్ ఫైట్ అని కొట్టిపారేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాజాగా మ‌రో అడుగు ముందుకేసి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కేసీఆర్ - జ‌గ‌న్ స‌మావేశ‌మై రాజ‌కీయ‌ ఒప్పందాలు చేసుకున్నార‌ని, అది కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లోనే జ‌రిగింద‌ని ఆరోపించారు. ఆ త‌ర్వాత బీజేపీ నాయ‌కులు కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో.. రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయంగా ఒక చ‌ర్చ మొద‌లైంది.

దీనిపై రోజా వెంట‌నే స్పందించారు. రేవంత్ రెడ్డి, బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ఖండించారు. త‌న ఇంట్లో జ‌గ‌న్ - కేసీఆర్ మ‌ధ్య మంత‌నాలు జరిగాయ‌ని రేవంత్ రెడ్డి చెబుతున్న మాట‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. అస‌లు త‌మ ఇంటికి జ‌గ‌న్ ఎప్పుడొచ్చార‌ని ప్ర‌శ్నించారు. కోవ‌ర్టు రెడ్డిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్‌.. త‌న మీద నింద‌లు వేయాల‌ని చూస్తే మాత్రం ఊరుకోబోన‌ని అన్నారు.

బీజేపీ నేత‌ల తీరుపైనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ త‌మిళ‌నాడులో దేవుడిని ద‌ర్శించుకోవ‌డానికి వెళ్తూ.. మ‌ధ్య‌లో త‌న నియోజ‌క‌వ‌ర్గం ఉండ‌డంతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశార‌ని చెప్పుకొచ్చారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ అక్క‌డ లేర‌ని, ఎలాంటి ఒప్పందాలూ జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు చేయించ‌డం చేత‌కాని బీజేపీ నాయ‌కులు.. న‌రేంద్ర మోడీని ప్ర‌శ్నించ‌డానికి భ‌య‌ప‌డే కాషాయ నేత‌లు.. ఆ అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని రోజా అన్నారు.