Begin typing your search above and press return to search.

ప‌రువు పాయే.. ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్టేనంటావా సాయిరెడ్డీ?!

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:08 AM GMT
ప‌రువు పాయే.. ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్టేనంటావా సాయిరెడ్డీ?!
X
రెండు రోజుల ముందు.. వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ సభ్యులు విజ‌య‌సాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. చాలా ఉత్సాహం కూడా ఆ ట్వీట్‌లో జొప్పించారు. అదేంటంటే.. రాజ్య‌స‌భ వైస్ చైర్మ‌న్‌గా త‌న‌ను నియ‌మించార‌ని(అంటే.. చైర్మ‌న్ సెల‌వు లేదా విశ్రాంతి స‌మ‌యంలో స‌భ‌ను న‌డిపించే పోస్ట‌న్న‌మాట‌) పేర్కొన్నారు. అంతేకాదు, ఇలా అవ‌కాశం ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కూడా పేర్కొన్నారు. అంతేకాదు, సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నాన‌ని కూడా పెద్త ప్ర‌తిజ్ఞ చేశారు.

తాజా అప్డేట్ ఏంటంటే.. విజయసాయిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుడుగా నియమిం చినట్లు రాజ్యసభ బులెటిన్ లో రెండు రోజుల క్రితం ప్రకటించగా.. బుధవారం తాజాగా ప్రారంభ‌మైన రాజ్యసభ శీతాకాల సమావేశాల మొదటి రోజున చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించిన వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితాలో సాయిరెడ్డి పేరు బూత‌ద్ద పెట్టి వెతికినా క‌నిపించ‌లేదు. ముందు ఈ నెల 5న విడుద‌లైన జాబితాలో విజయసాయి రెడ్డి పేరు ఉంది.

దీంతో ఆయ‌న రెచ్చిపోయి మ‌రీ ట్వీట్లు చేశారు. కానీ, బుధవారం మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌లో మాత్రం వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితాలో విజయసాయిరెడ్డి పేరు క‌నిపించ‌లేదు.. చైర్మ‌న్ నోటి వెంట వినిపించ‌నూ లేదు. దీంతో సాయిరెడ్డిపై విమ‌ర్శ‌ల ట్వీట్లువెల్లువెత్తాయి. "ఇదేంది సాయిరెడ్డీ.. " అనే కామెంట్లు కురిశాయి.

ఏం జ‌రిగి ఉంటుంది? సాయిరెడ్డికి, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌రాజుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే వైరం ఉంది. ఇటీవ‌లే ర‌ఘురామ‌ను విగ్గురాజు..పెగ్గురాజు.. అరె ఒరే అంటూ సాయిరెడ్డి కించ‌ప‌రిచారు. ఇలాంటి ట్వీట్ల‌పైనే ఆర్ ఆర్ ఆర్ రాజ్య‌స‌భ‌కు ఫిర్యాదు చేశారు. విజయసాయి రెడ్డి పార్లమెంట్ సభ్యులకు ఉండాల్సిన కనీస సభ్యత, మర్యాద, హుందాతనం, క్రమశిక్షణ లేకుండా ట్వీట్లు చేస్తున్నారని ఆర్ ఆర్ ఆర్ జగదీప్ ధన్ ఖడ్ కు ఫిర్యాదు చేశారు.

సభ్యుల ప్రవర్తనను తీర్చిదిద్దడంలో చైర్మన్ పాత్ర ఎంతో ఉంటుందని ఆయన చెప్పారు. అందువల్ల పెద్దల సభ ఔన్నత్యాన్ని కాపాడేందుకు పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్, ఎథిక్స్ కమిటీ సభ్యత్వం నుంచి విజయసాయి రెడ్డిని తప్పించాలని రఘ రామరాజు ఆయనను కోరారు. మొత్తానికి కార్యాకార‌ణ సంబంధం అన్న‌ట్టుగా.. ర‌ఘురామ ఫిర్యాదును ఉప‌రాష్ట్ర‌ప‌తి క‌మ్ చైర్మ‌న్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారా? లేదా? అనేది క్లారిటీ లేదుకానీ.. సాయిరెడ్డికి మాత్రం వ‌చ్చిన అవ‌కాశం అయితే చేజారింది. దీంతో ఇప్పుడు నెటిజ‌న్లు ఏంది సాయిరెడ్డీ.. ఏందిది.. ఇట్టా ఇరుక్కున్నా..ప‌రువు పోలా!!.. ప‌రువు పాయే.. ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్టేనంటావా సాయిరెడ్డీ?! అని కామెంట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.