Begin typing your search above and press return to search.

ప్రపంచానికి షాక్.. పిశాచి వైరస్ కు టీకా అప్పటికి కానీ కాదట!

By:  Tupaki Desk   |   12 Feb 2020 9:00 AM GMT
ప్రపంచానికి షాక్.. పిశాచి వైరస్ కు టీకా అప్పటికి కానీ కాదట!
X
అతి తక్కువ సమయంలో ప్రపంచ ప్రజలకు బాగా తెలిసిపోయిన.. భయాందోళనలకు గురి చేసిన వైరస్ ఏదైనా ఉందంటే కవిడ్ (అదేనండి.. నిన్నటి వరకూ కరోనాగా పిలిచే వాళ్లం కదా దానికి పెట్టిన కొత్తపేరు) వైరస్సేనని చెప్పాలి. చైనాలోని వూహాంగ్ లో మొదలైన ఈ వైరస్ స్వల్ప వ్యవధి లోనే దాదాపు పాతిక దేశాలకు విస్తరించింది. వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇంకా.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడినట్లు గా చెబుతున్నారు. ఈ వైరస్ మీద అనుమానంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. చాలా వరకూ ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల కంటే నెగిటివ్ కేసులే ఎక్కువగా వస్తున్నాయి.

భారత్ లాంటి కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా.. చలి దేశాల్లో మాత్రం ఇది ఇట్టే వ్యాపించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కావిడ్ దూకుడు కు పగ్గం వేసే టీకా మందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు మొదలు.. పలువురు ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకూ ఈ వైరస్ ను ఎలా కట్టడి చేయాలన్న దానిపై వైద్యులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. పలు కాంబినేషన్లో మందులు ఇచ్చి రోగులకు రోగ నిరోధక శక్తిని పెంచటం ద్వారా ఈ పిశాచి పడగ నీడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కొన్ని కేసుల్లో ప్రాణాల్ని కాపాడారు కూడా.

మరోవైపు ఈ వైరస్ కు టీకాను రూపొందించే వ్యవహారం మరో పద్దెనిమిది నెలల వరకూ పడుతుందన్న మాట విన్నంతనే నోట మాట రాకపోగా? ఇంతకాలం పిశాచి వైరస్ ను ఎలా ఎదుర్కోవాలన్న గుబులు రేగుతుంది. కొవిడ్ వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి వివిధ దేశాలు గడిచిన రెండు రోజులుగా సమావేశమయ్యాయి.

ఈ సందర్భం గా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాన్ అధానోమ్ గెబ్రేయసన్ మాట్లాడుతూ.. ప్రపంచానికి ప్రమాదికారి అయిన ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు టీకాను త్వరగా తయారు చేయాలన్నారు. ఇందుకు భిన్నంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే.. రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు భయాన్ని.. పద్దెనిమిది నెలల వరకూ కొవిడ్ కు మందు కనుగొనటానికి టైం పడుతుందన్న మాట విన్నంతనే నిలువెత్తు నీరసం ఆవహించక మానదు. ఏమైనా చేయగలిగిన మనిషి.. కంటికి కనిపించని కొవిడ్ లాంటి వైరస్ కు చెక్ పెట్టేందుకు నెలల తరబడి టైం తీసుకోవటం గమనార్హం.