Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల‌ దోస్తే కేసీఆర్ కంటి ఆప‌రేష‌న్ చేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   8 Sep 2017 7:17 AM GMT
ప‌దేళ్ల‌ దోస్తే కేసీఆర్ కంటి ఆప‌రేష‌న్ చేశాడ‌ట‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు భిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త అనే సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌ ఉద్య‌మం...టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌స్థానం...ముఖ్య‌మంత్రిగా ప‌రిపాల‌న చేయ‌డం.... ఏదైనా కేసీఆర్ లెక్క‌లు వేరే ఉంటాయి. మిగ‌తా వారికంటే అవి ఎంతో భిన్నం. అయితే ఇదే తీరును తాజాగా ఆయ‌న ఆరోగ్యం విష‌యంలోనూ పాటించార‌ని అంటున్నారు. ఇంత‌కీ ఏ విష‌యంలో అంటే కేసీఆర్ కంటి ఆప‌రేష‌న్ విష‌యంలో.

కేసీఆర్ ఆరోగ్యంపై గ‌తంలో ప‌లు ర‌కాల అభిప్రాయాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ అవ‌న్నీ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. ఆఖ‌రికి ఆయ‌న‌కు చిన్న స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలింది. అదే కాటరాక్ట్ స‌ర్జ‌రీ. మెడిక‌ల్ హ‌బ్‌ గా పేరొందిన హైద‌రాబాద్‌ లో ఇలాంటి స‌మ‌స్య‌కు అత్యుత్త‌మ చికిత్స చేసే ప్ర‌ముఖ కార్పొరేట్ ఆస్ప‌త్రులు ఎన్నో హైద‌రాబాద్‌ లో ఉన్నాయి. కానీ ఈ విష‌యంలో త‌న రాజ‌ధాని న‌గ‌రం కంటే...త‌న దోస్తునే కేసీఆర్ న‌మ్ముకున్నారు. ఢిల్లీ కేంద్రంగా వైద్య‌సేవ‌లు అందిస్తున్న‌ సుప్రసిద్ధ కంటి వైద్య నిపుణుడు - పద్మశ్రీ అవార్డు గ్రహీత సెంటర్ ఫర్ సైట్ (సీఎఫ్‌ ఎస్) చైర్మన్ డాక్టర్ మహిపాల్ ఎస్ సచ్‌ దేవ్ వ‌ద్ద కేసీఆర్ కంటి శస్త్రచికిత్స చేసుకున్నారు. ఈ చికిత్స‌ విజయవంతమైంది.

ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే డాక్ట‌ర్ స‌చ్‌ దేవ్ కేసీఆర్‌ కు మంచి మిత్రుడు. డాక్టర్ సచ్‌ దేవ్‌ తో కేసీఆర్‌ కు పదేళ్లుగా పరిచయం ఉంది. ఐదు సంవత్సరాల క్రితం సీఎం ఎడమకంటికి ఆయనే ఆపరేషన్ చేశారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్రమంత్రిగా ఉన్నపుడు కూడా కంటి సమస్యలపై సచ్‌ దేవ్‌ ను సంప్రదించేవారు. తాజాగా ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భంగా కూడా ఆయ‌న వ‌ద్దే చికిత్స చేయించుకోవ‌డం కేసీఆర్ న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

కాగా, ఈ శ‌స్త్రచికిత్స‌పై డాక్ట‌ర్ స‌చ్‌ దేవ్ సంతోషం వ్య‌క్తం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి వంటి పెద్దవారు సెంటర్ ఫర్ సైట్‌ లో ఆపరేషన్ చేయించుకోవడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కంటి ఆపరేషన్ లో రెస్టోరేటివ్ సర్జరీ నుంచి రెఫ్రాక్టివ్ సర్జరీ విధానం అందుబాటులోకి వచ్చిందని దీనివల్ల కండ్లద్దాలు లేకుండా చూడగలుతారని డాక్ట‌ర్ స‌చ్‌ దేవ్‌ వివరించారు.