Begin typing your search above and press return to search.

శవం ద్వారా కరోనా వ్యాపిస్తుందా ..వైద్యులు ఏంచెప్తున్నారంటే ?

By:  Tupaki Desk   |   23 July 2020 8:30 AM GMT
శవం ద్వారా కరోనా వ్యాపిస్తుందా ..వైద్యులు ఏంచెప్తున్నారంటే ?
X
దేశంలో రోజురోజుకి విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేసింది. ప్రతిరోజూ కూడా కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీనితో ఇళ్లల్లో నుండి బయటకి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. చివరకు శవం ద్వారా కరోనా వ్యాపిస్తుందని నమ్మి కొంతమంది అంత్యక్రియలకు కూడా దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు కరోనాతో మృతి చెందారని , చివరి చూపుకి పొతే మనకి కూడా కరోనా సోకే అవకాశం ఉందని భయంతో ఆ మృతదేహం దగ్గరికి కూడా పోవడం లేదు. అయితే , సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం మృతి చెందిన వారికి మనం ఇచ్చే చివరి గౌరవం. అయితే వైరస్ వల్ల అనుమానిత లక్షణాలతో చనిపోయినవారిని కూడా తాకడానికి భయపడుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనాతో చనిపోయిన మృతదేహాల అంత్యక్రియలని కూడా అడ్డుకుంటున్నారు.

అయితే వైద్య నిపుణులు మాత్రం కరోనా మృతదేహాల విషయంలో భయాందోళన అవసరం లేదని, కరోనా ప్రధానంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు తుంపరల ద్వారా వ్యాపించే వైరస్ కాబట్టి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తికి దాదాపు అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను హైపోక్లోరైట్‌ ద్రావణంతో డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేసి అవి బయటకు కనపడకుండా డ్రెస్సింగ్‌ చేసి ఇస్తారని అందువల్ల మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు చివరిసారి చూసి నివాళులు అర్పించవచ్చని... మృతదేహాన్ని మాత్రం తాకరాదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చనిపోయిన వారి బాడీ లో గరిష్టంగా వైరస్ 3 నుండి 4 గంటలు మాత్రమే ఉంటుంది అని తెలిపారు. దహనం చేస్తే అస్థికలను నిరభ్యంతరంగా సేకరించుకోవచ్చు. వాటిలో వైరస్‌ ఉండే అవకాశమే లేదని తెలిపారు.