Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్ల క‌న్నా రైతులే మిన్న‌!

By:  Tupaki Desk   |   20 Jun 2017 8:10 AM GMT
క్రికెట‌ర్ల క‌న్నా రైతులే మిన్న‌!
X
భార‌త్‌లో క్రికెట్ ఓ మ‌తం... క్రికెట‌ర్ల‌ను డెమీ గాడ్‌ లు గా ఆరాధిస్తారు. ఆ అభిమానాన్ని - గౌర‌వాన్ని మ‌న క్రికెట‌ర్లు కూడా అదే స్థాయిలో ఆస్వాదిస్తుంటారు. ఆ హీరోయిక్ స్టేట‌స్‌ ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, బంగ్లాదేశ్ కెప్టెన్ మ‌ష్ర‌ఫీ మోర్త‌జా ఇందుకు భిన్నమైన వ్యాఖ్య‌లు చేశాడు. ఏ దేశంలోనైనా రైతులే నిజ‌మైన హీరోలని అభిప్రాయ‌ప‌డ్డాడు.

ప్ర‌స్తుతం మోర్తజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రికెటర్లుగా తాము దేశానికి చేసేదేమీ లేదని, త‌మను హీరోలుగా - స్టార్లుగా కీర్తించవద్దని మోర్తజా కోరాడు. డ‌బ్బుల కోస‌మే క్రికెట్ ఆడుతున్నామ‌ని, క్రికెట్ కు - దేశ భక్తికి ముడిపెట్టవద్దని చెప్పాడు. అహ‌ర్నిశ‌లు శ్ర‌మించి మ‌న‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టే రైతులు - శ్రామికులు - ప్రాణాలను కాపాడే డాక్టర్లే నిజమైన హీరోలని అన్నాడు.

తాము కేవ‌లం ఆట‌గాళ్ల‌మేన‌ని, క‌నీసం ఒక ఇటుకను కూడా తయారు చేయలేమని మోర్తాజా అన్నాడు. దేశాన్ని నిర్మించే శ‌క్తి శ్రామికుల‌కుంద‌ని కితాబిచ్చాడు. నిజానికి, ఒక యాక్టర్ - ఒక సింగర్ ఏం చేస్తాడో తాము కూడా అదే చేస్తున్నామన్నాడు.

కొంద‌రు దేశ భక్తి గురించి ఉప‌న్యాసాలిస్తుంటార‌ని, వారు దేశం కోసం ఆలోచించాలని సూచించాడు. దేశ పౌరులుగా క‌నీస బాధ్య‌త‌లు నెర‌వేర్చాల‌ని పిలుపునిచ్చాడు. రోడ్ల మీద చెత్త వేయడం - వీధుల్లో ఉమ్మి వేయడం - ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వంటివి మానుకున్న‌ప్పుడే దేశంలో మార్పులు వ‌స్తాయ‌ని చెప్పాడు. దేశం కోసం నిజాయితీగా పని చేయడమే, నిజమైన దేశభక్తి అని తెలిపాడు. క్రికెట్ - దేశ‌భ‌క్తికి మ‌ధ్య సంబంధం ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/