Begin typing your search above and press return to search.

‘హైటు’ ఆపరేషన్ చేసిన డాక్టర్ కు శిక్షేశారు

By:  Tupaki Desk   |   5 Nov 2016 5:20 AM GMT
‘హైటు’ ఆపరేషన్ చేసిన డాక్టర్ కు శిక్షేశారు
X
మీరు హైట్ తక్కువగా ఉన్నారా? మేం చేసే ఆపరేషన్ చేయించుకుంటే మీరు హైట్ పెరిగిపోతారంటూ చెప్పే మాటలకు.. చేసే పనులకు మధ్య వ్యత్యాసం ఎంతన్నది నిఖిల్ రెడ్డి ఉదంతం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. గత ఏడాది ఏప్రిల్ లో హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో హైట్ ఆపరేషన్ చేయించుకున్న ఐటీ కుర్రాడు నిఖిల్ రెడ్డి పరిస్థితి తర్వాత ఏమైందో తెలిసిందే. నేటికీ.. అతగాడు.. మరొకరి సాయం లేకుండా నడవలేని దుస్థితి. 5 అడుగుల ఏడు అంగుళాల ఎత్తున్న ఆ కుర్రాడు.. ఆరడుగులు కుర్రాడిగా మారాలన్న ఒకే ఒక్క పిచ్చి కోరికతో.. వైద్యులు చెప్పిన తియ్యటి మాటల్ని నమ్మి ఆపరేషన్ చేయించుకున్న పాపానికి ఈ రోజు వరకూ అతడు నరకం అనుభవిస్తున్నాడు.

తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసిన నిఖిల్ రెడ్డికి ఊరట కలిగించేలా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. నిఖిల్ రెడ్డికి హైట్ ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆసుపత్రి అర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్ పై రెండేళ్ల పాటు వేటు వేశారు. రెండేళ్ల పాటు ఆయన ఎలాంటి వైద్యం చేయకూడదని కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది.

వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన చంద్రభూషణ్ వ్యవహారంపై కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పై వేటు వేయటమే కాదు.. నిఖిల్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య నిపుణులను అతని వద్దకు పంపాలని నిర్ణయించింది. హైటు పెరగాలన్న ఉద్దేశంతో గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్ చెప్పిన మాటల్ని నమ్మి అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఆయన చెప్పిన రీతిలో ఆపరేషన్ చేయించుకుంటే రోజుల వ్యవధిలో హైటు పెరిగిపోతానని నమ్మిన అతడు.. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆపరేషన్ కు ఓకే చెప్పేశాడు.

ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆసుపత్రికి చెల్లించాడు.అయితే.. కొడుకు ఇంటికి రాకపోవటంతో ఆరా తీసిన నిఖిల్ తల్లిదండ్రులకు జరిగిన ఉదంతం తెలియటం.. వారాలు గడుస్తున్నా అతడు నార్మల్ కండీషన్ లోకి రాకపోవటంతో వైద్యులు చెప్పిన మాటల్లో నిజం లేదన్న విషయం అర్థమైంది. కాసుల కక్కుర్తితో వైద్యుడు చేసిన ఈ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా సదరు డాక్టర్ మీద రెండేళ్ల పాటు వేటు వేస్తూ తెలంగాణ మెడికిల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/