Begin typing your search above and press return to search.

రెండు డోసులు సరిపోవా .. . మూడో డోసు పడాల్సిందేనా ?

By:  Tupaki Desk   |   7 Oct 2021 9:11 AM GMT
రెండు డోసులు సరిపోవా .. . మూడో డోసు పడాల్సిందేనా ?
X
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం కొన్ని నెలల పాటు స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి జోరు తగ్గుముఖం పడుతుండటం తో మళ్లీ అందరూ తమ తమ పనుల్లో బిజీగా మారుతున్నారు. అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే .. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. కేవలం తగ్గుముఖం పట్టింది అంతే ఏ క్షణంలో అయినా కూడా మళ్లీ కరోనా మహమ్మారి జోరు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తి ని అరికట్టడానికి మన దగ్గరున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. దీనితో ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ ను యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేస్తూ అందరికి అందజేస్తున్నారు.

అయితే , కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేపించుకోవడానికి జనాలు ఎగబడుతుంటే , ఇంకొన్ని దేశాల్లో మాత్రం వ్యాక్సిన్ ఫ్రీ గా వేస్తామంటున్నా కూడా అటువైపు తొంగి చూడటంలేదు. క‌రోనా త‌మ‌ను ఏమీ చేయ‌లేద‌నే ధీమా కోట్ల మందిలో ఉంది. ఇప్పుడు ఉచితంగా ప్ర‌భుత్వం భారీ ఎత్తున వ్యాక్సిన్ ల‌ను అందుబాటులో ఉంచినా చాలా మంది అవ‌కాశం ఉన్నా వేయించుకోవ‌డం లేదు. ఇక ఏదో భ‌య‌ప‌డి తొలి డోసు వేయించుకున్న అనేక మంది రెండో డోసు జోలికి వెళ్ల‌డం లేదు. ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లు, వలంటీర్లు.. ఇంటింటికీ తిరుగుతూ, వ్యాక్సిన్ వేయించుకోమ‌ని పోరుతున్నా జ‌నాలు ప‌ట్టించుకోవ‌డం లేదు.ఇదీ మ‌న దేశంలో ప‌రిస్థితి. కావాల్సిన వాళ్లు వేయించుకుంటున్నారు, మ‌రి కొంద‌రు ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి వ‌ల్ల త‌ప్ప‌క వేయించుకుంటున్నారు.

అయితే , చాలామంది వ్యాక్సిన్ వేసుకోండి అంటేనే వేసుకోవడం లేదు. కానీ, రెండు డోసులు వేయించుకున్న వారికి కూడా యాంటీ బాడీలు పెరగడం లేదట. ముంబై లో ఉన్న కొందరు డాక్టర్లు రెండు డోసులు వేయించుకున్న తర్వాత కొంచెం ఆందోళన చెంది , ఎందుకీ ఆందోళన అనుకున్నారేమో వారే యాంటీబాడీల టెస్ట్ చేసుకున్నారట. రెండు డోసుల వ్యాక్సిన్ అనంత‌రం కూడా త‌మ శ‌రీరాల్లో పెద్ద‌గా క‌రోనా యాంటీబాడీలు క‌నిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ వారు మూడో డోసుకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. యాంటీ బాడీల టెస్టుల త‌ర్వాతే వారు మూడో డోసును వేయించుకుంటున్నార‌ని తెలుస్తోంది. భయం తో కొందరు వ్యాక్సిన్ల మీద వ్యాక్సిన్లు తీసుకుంటుంటే ఇంకొందరు మాత్రం వ్యాక్సిన్ వద్దు ఏమీ వద్దు అంటూ సైలెంట్ గా ఉంటూ మనకేం కాదు అని దైర్యంగా ఉన్నారు.

రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు బూస్టర్ డోస్ సైతం అవసరం కావచ్చని చెబుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అనురాగ్ అగర్వాల్. అయితే ఇవి ప్రస్తుతం అత్యవసరం కాదని తెలిపారు. ప్రస్తుతం ఐజీఐబీ సంస్థ కరోనా కొత్త వేరియంట్‌లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి సార్స్-కోవ్-2 జన్యువుల నిర్మాణాలపై పరిశోధనలు చేస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు రెండు టీకా డోసులు తీసుకుంటే.. వారిలో రోగనిరోధక శక్తి బూస్టర్ డోసు తీసుకున్నంత స్ట్రాంగ్‌గా బలపడే అవకాశం ఉందని డా.అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రెండు టీకా డోసులతో సహా బూస్టర్ డోసు తీసుకోవడం కంటే.. కరోనా వైరస్ సంక్రమణ తర్వాత రెండు టీకా డోసులు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మరింత బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. కోవిడ్ నుంచి రికవర్ అయిన వారు ఒక్క డోసు వైరస్ తీసుకున్నా.. సమర్థవంతమైన రక్షణ లభిస్తుందన్నారు. ఐసీఎంఆర్ జూన్, 2021 సర్వేలో 60% కంటే ఎక్కువ సెరోపాజిటివిటీ రేటు నమోదైంది కాబట్టి ఇప్పటికిప్పుడు అధిక సంఖ్యలో భారతీయులకు బూస్టర్‌ డోస్‌లు అవసరం కాకపోవచ్చని వివరించారు అయితే కొందరిలో మాత్రం రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు పెద్దగా కనిపించకపోవడం తో ఆందోళన చెందుతున్నారు .