Begin typing your search above and press return to search.

'డోలో 650' మాత్ర‌లు రాసిన డాక్ట‌ర్ల‌కు కోట్లలో తాయిలాలు.. న‌మ్మ‌లేని నిజం!

By:  Tupaki Desk   |   19 Aug 2022 12:30 AM GMT
డోలో 650 మాత్ర‌లు రాసిన డాక్ట‌ర్ల‌కు కోట్లలో తాయిలాలు.. న‌మ్మ‌లేని నిజం!
X
ఏచిన్న‌పాటి జ్వ‌రం వ‌చ్చి డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లినా.. వారు రాసే మందుల చీటీలో(ప్రిస్క్రిప్ష‌న్‌) ఖ‌చ్చితంగా డోలో-650 ఉంటుంది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. జూనియ‌ర్ కాదు.. సీనియ‌ర్ కాదు.. ఏ డాక్ట‌రైనా.. డోలో 650 అంటే అంతగా ప్రేమ పంచేస్తారు.

మ‌రి దీనికి కార‌ణం ఏంటి? జ్వ‌రం వ‌స్తే.. ప్ర‌త్యామ్నాయ మాత్ర‌లు.. ఔష‌ధాలు లేవా? అంటే.. ఉన్నాయి. కానీ.. ఆయా ఔష‌ధాల కంపెనీలు ఏవీ కూడా డాక్ట‌ర్ల‌కు మేలు చేయ‌వుక‌దా! అందుకే డోలో 650 వైపే వైద్యులు మొగ్గు చూపుతున్నారు. దీని వెనుక వైద్యుల‌కు అందుతున్న ముడుపులు కోట్ల రూపాయ‌ల్లో ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. కానీ, ఇది ప‌చ్చినిజం.

డోలో 650 తయారీదారులు తమ మాత్రలను రోగులకు సిఫార్సు చేయించడం కోసం వైద్యులకు పెద్ద ఎత్తున ముడుపులు అందించిన కేసుపై సుప్రీంకోర్టు వాదనలు ప్రారంభించింది. రోగులకు డ్రగ్స్ సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా నిరోధించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇది వినసొంపుగా ఏమీ లేదు. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. కొవిడ్ సోకినప్పుడు ఇదే మాత్ర తీసుకోవాలని నాకు కూడా వైద్యులు సూచించారు' అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.

ఫార్మా సంస్థలు నైతికంగా వ్యవహరించేలా చూడటం చాలా ముఖ్యమని వ్యాజ్యంలో మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. జీవన హక్కులో.. వైద్య హక్కు కూడా భాగమేనని వాదించింది. ప్రస్తుతం కంపెనీలు వైద్యులకు ఉచితాలు అందించకుండా నిరోధించే చట్టమేమీ లేదని కోర్టుకు తెలిపింది. ఉచితాలు తీసుకొని ప్రజలకు ఔషధాలు ఇచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరమని పేర్కొంది. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. పది రోజుల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మైక్రో ల్యాబ్స్‌ అనే సంస్థ డోలో 650 మాత్రలను తయారు చేస్తోంది. ఆ కంపెనీ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాల్లోనూ గతంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో భాగంగా మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో కీలక పత్రాలు లభ్యమయ్యాయి. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది. ఈ క్ర‌మంలోనే వైద్యులు త‌మ‌కు మేలు చేసేలా.. వారికి రూ. కోట్ల‌లో ముడుపులు ఇచ్చిన‌ట్టు అధికారులు సైతం గుర్తించారు.