Begin typing your search above and press return to search.

బీజేపీ.. ఒక ఆట చూడాలనుకుంటోందా!

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:30 PM GMT
బీజేపీ.. ఒక ఆట చూడాలనుకుంటోందా!
X
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం విషయంలో భారతీయ జనతా పార్టీ వెనక్కు తగ్గడం ఆసక్తిదాయకంగా మారింది. ముందుగా గవర్నర్ భారతీయ జనతా పార్టీనే పిలవడం, అందుకు ఆ పార్టీ నో చెప్పడం తెలిసిన సంగతే. మహారాష్ట్రలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వం తమదేనంటూ ముందుగా బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. అయితే చివరకు వెనక్కు తగ్గారు!

ఇందులో ఆంతర్యం ఏమిటి? అనేది ఆసక్తిదాయకమైన అంశం. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెనుకడుగు వేస్తే.. శివసేన వాళ్లు కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేది బీజేపీకి తెలియనిది ఏమీ కాదు.

అయినా.. బీజేపీ వాళ్లకే అవకాశం వెళ్లేలా చేసింది. ఇదంతా ఎందుకు? శివసేనను కన్వీన్స్ చేయడానికి బీజేపీ అసలు ప్రయత్నించనే లేదు. శివసేన విధించిన షరతుల విషయంలో అసలు సంప్రదింపులే చేయలేదు. మధ్యవర్తులను పంపడం కానీ, శివసేనను బుజ్జగించడం కానీ చేయలేదు.

కావాలంటే శివసేనకు కేంద్రంలో కోటా పెంచవచ్చు, వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులను కేటాయించవచ్చు.. అలా బుజ్జగించడానికి ఎన్నో మార్గాలున్నాయి బీజేపీ ముందు. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీనే పవర్ లో ఉంది!

అయినా అలాంటి అవకాశాలను బీజేపీ అసలే మాత్రం ఉపయోగించుకోలేదు. తాము చెప్పినట్టుగా వినేట్టు అయితే సేన తమ వెంట రావాలి, లేకపోతే లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరించింది. ఇందులో ప్రస్తుతానికి కనిపిస్తున్న మర్మం ఒకట్టే, సేనను కూడా కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి బద్నాం చేయడం. ఎలాగూ కేంద్రంలో పవర్ బీజేపీ వద్దే ఉంది కాబట్టి, ఆ పార్టీలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వారిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కగలదు బీజేపీ. అందుకే ప్రస్తుతానికి తాపీగా ఉన్నట్టుంది. వారి ఆటనూ చూడటానికి బీజేపీ ఆసక్తితో ఉన్నట్టుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.