Begin typing your search above and press return to search.

గూగుల్ పే వివాదం.. హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   13 April 2019 6:02 AM GMT
గూగుల్ పే వివాదం.. హైకోర్టు షాక్
X
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్. ఈ సంస్థకున్న బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1. అలాంటి సంస్థ పేమెంట్స్ రంగంలోకి దిగింది. ‘గూగుల్ పే’ అనే యాప్ ను రూపొందించి దేశంలో బ్యాంకు రహిత పేమెంట్స్ కు శ్రీకారం చుట్టింది. గూగుల్ పై నమ్మకంతో జనాలందరూ డౌన్ లోడ్ చేసుకొని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. వినియోగదారుడి ఫోన్ నంబర్ - బ్యాంకు డీటైయిల్స్ లింక్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. క్షణాల్లో డబ్బులు అవతలి వారికి డైరెక్ట్ గా బ్యాంకు ద్వారానే బదిలీ కావడంతో జనాలు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. అలా పాపులర్ అయిన గూగుల్ పేకు తాజాగా ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ లేకుండానే గూగుల్ పే కార్యకలాపాలు సాగిస్తోందంటూ అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ చట్టాన్ని ఈ యాప్ ఉల్లంఘించిందని పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ యాప్ కార్యకలాపాలు ఎలా సాగిస్తోందని కోర్టు ఆర్బీఐని ప్రశ్నించింది.

దేశంలో మోడీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసిన తర్వాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించింది.పెద్ద ఎత్తున సంస్థలు డిజిటల్ లావాదేవీల సంస్థలను ప్రారంభించాయి. ఈ కోవలోనే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, వాట్సాప్ పేలు వచ్చాయి. అయితే గూగుల్ పే మాత్రం ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోకుండానే నగదు పంపిణీ చేపట్టిందని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మార్చి 20న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్స్ సిస్టమ్స్ ఆపరేటర్స్ జాబితాలో గూగుల్ పే పేరు లేదని అభిజిత్ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు గూగుల్ పేకు షాకిస్తూ నోటీసులు ఇచ్చింది.

అయితే గూగుల్ పే సంస్థ మాత్రం తాము అన్ని అనుమతులను కలిగి ఉన్నామని స్పష్టం చేసింది. తమ భాగస్వామ్య బ్యాంకులకు ఓ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ గా సేవలందిస్తున్నట్టు తెలిపింది. యూనైటెడ్ పేమంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఏ) ఇన్ ఫ్రాక్ష్చర్ ద్వారా పేమంట్స్ కు అనుమతులు తీసుకున్నామని గూగుల్ వివరించింది. ఇది పేమెంట్ ప్రాసెసింగ్ లేదా సెటిల్మెంట్ లో భాగం కాదని.. అందుకే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి లైసెన్స్ లు అక్కర్లేదని గూగుల్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ డేటాను స్థానికంగా దేశంలోనే భద్రపరిచామని గూగుల్ పేర్కొంది. ఈ విషయంలో భాగస్వామ్య బ్యాంకులు, ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు.