Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాలే.. టార్గెట్‌? గుజ‌రాత్ మిస్స‌యిందే!

By:  Tupaki Desk   |   20 July 2022 5:30 PM GMT
ఆ రాష్ట్రాలే.. టార్గెట్‌?  గుజ‌రాత్ మిస్స‌యిందే!
X
రాజ‌కీయాలు ఎలాగైనా చేయొచ్చా? రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ఏ విధంగా అయినా.. బ‌ల‌హీన ప‌రచొచ్చా? అంటే.. కేంద్రం అవ‌లంబిస్తున్న విధానాలను గ‌మ‌నిస్తున్న‌వారు.. ఔన‌నే అంటున్నారు. తాజాగా రాష్ట్రాలు అప్పుల పాల‌వుతున్నాయ‌ని.. ఆయా రాష్ట్రాల్లో శ్రీలంక దేశంలో సంభ‌వించిన ప‌రిస్థితులు వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. తాజాగా వేసిన అప్పుల దండోరా స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఏయే రాష్ట్రాలు ఎంత అప్పులు చేస్తున్నాయో.. వివ‌రించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ రుణాలు జీఎస్‌డీపీలో 32%కి చేరినట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటినట్లు పేర్కొన్నారు. '2019-2022 మధ్యకాలంలో ఏపీ బడ్జెటేతర మార్గాల నుంచి రూ.28,837 కోట్ల రుణం తీసుకుంది. విద్యుత్తు సంస్థలకు రూ.10,109 కోట్ల బకాయిలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.34,208 కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది' అని వివరించారు.

తెలంగాణ రుణాలు జీఎస్‌డీపీలో 25%కి చేరాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి, వృద్ధి రేటు, అప్పుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? బడ్జెటేతర రుణాలు ఎంత మేరకు తీసుకున్నాయి? ఆస్తుల తాకట్టు, డిస్కంలు, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రాలు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అయితే.. కేంద్రానికి నిజంగానే ప‌క్ష‌పాతం లేక‌పోతే..ఈ జాబితాలో గుజ‌రాత్ ఏమైన‌ట్టు.. మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌కు అప్పులు లేవా? లేక‌.. అప్పులు చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే ..అక్క‌డ బీజేపీ ప్రభుత్వం బ‌హుచక్క‌ని పాల‌న అందిస్తోందా?

పోనీ.. ఇదే నిజ‌మ‌ని అనుకుంటే.. అదే బీజేపీ పాలిత యూపీలో అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవ‌న్నీ.. చెప్ప‌డం వెనుక అస‌లు ఉద్దేశం వేరే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. మోడీ.. సొంత రాష్ట్రం అప్పులు జాబితాలో తొలి మూడోస్థానంలో ఉంద‌నేది వాస్త‌వం. దానిని విస్మ‌రించి.. విప‌క్ష పాలిత రాష్ట్రాల‌ను టార్గెట్ చేయ‌డం వెనుక‌.. రాజ‌కీయం త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని విశ్లేష‌కుల మాట‌.