Begin typing your search above and press return to search.

రైతు దినోత్స‌వ‌మా.. నిరుద్యోగ దినం!

By:  Tupaki Desk   |   15 Feb 2022 7:29 AM GMT
రైతు దినోత్స‌వ‌మా.. నిరుద్యోగ దినం!
X
తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా మాట‌ల యుద్ధంలో దూసుకెళ్ల‌డంతో త్రిముఖ పోరు క‌నిపిస్తోంది. రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల నాటికి ఈ మూడు పార్టీల మ‌ధ్య యుద్ధం మ‌రింత పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఇప్పుడే ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైందా అనేలా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం ఈ రాజ‌కీయాల‌కు మ‌రింత హీటెక్కించేలా క‌నిపిస్తోంది.

ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన‌రోజును రైతు దినోత్స‌వంగా జ‌ర‌పాల‌ని టీఆర్ఎస్ చూస్తోంది. రైతు వేదిక‌ల వ‌ద్ద ఘ‌నంగా వేడుక‌లు చేయాల‌ని రాష్ట్ర రైతుబంధు స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

త‌న పాల‌న‌లో ఉచిత విద్యుత్‌, రైతు బంధు, బీమా, రుణ‌మాఫీ లాంటి అద్భుత ప‌థ‌కాల‌తో వ్య‌వ‌సాయాన్ని కేసీఆర్ పండ‌గ‌లా మార్చార‌ని ఆయ‌న తెలిపారు. ఆయ‌న కృషికి కృతజ్ఞ‌త‌గా ఘ‌నంగా కేసీఆర్ పుట్టిన రోజును రైతు దినోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని కోరారు. ఎమ్మెల్యేల ఆధ్వ‌ర్యంలో అన్న‌దాత‌ల‌ను స‌న్మానించుకుందామ‌ని చెప్పారు. మ‌రోవైపు ఐటీ మంత్రి కేటీఆర్‌.. కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మూడు రోజుల ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.

మ‌రోవైపు కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ పుట్టిన రోజును నిరుద్యోగ దినంగా జ‌ర‌పాల‌ని నిర్ణయించింది. ఈ మేర‌కు పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌ని యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌సేనారెడ్డి వెల్ల‌డించారు. 15న అమ‌ర‌వీరుల‌కు నివాళులు, 16న దీక్ష‌లు, 17న స్పీకాఫ్ తెలంగాణ పేరుతో నిరుద్యోగ యువ‌త సెల్ఫీ వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో పెట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తోంది. కానీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అధికార టీఆర్ఎస్‌కు నోటిఫికేష‌న్ విష‌యం గుర్తుకువ‌స్తోంద‌ని.. ఆ త‌ర్వాత దాన్ని మ‌ర్చిపోతున్నార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.