Begin typing your search above and press return to search.

గురువు దారిలో శిష్యుడు కానీ ? ఒక క‌ల ఒక నిజం

By:  Tupaki Desk   |   22 Feb 2022 4:30 PM GMT
గురువు దారిలో శిష్యుడు కానీ ? ఒక క‌ల ఒక నిజం
X
పార్టీల ప‌రంగా ఆ ఇద్ద‌రూ వేర్వేరు. ప్రాంతాల ప‌రంగా కూడా ఆ ఇద్ద‌రూ వేర్వేరు.సైద్ధాంతిక భావ‌జాలం రీత్యా కూడా ఒక‌రి దారి మ‌రొక‌రు అస్స‌లు అనుస‌రించ‌రు. కానీ ఆ ఇద్ద‌రూ గురు శిష్యులు. వారే చంద్ర‌బాబు మ‌రియు కేసీఆర్. ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తిరుగులేని చ‌రిష్మాను ద‌క్కించుకున్న చంద్ర‌బాబు కాల‌గ‌తిలో అవ‌శేషాంధ్ర‌కూ అదే ప‌ద‌విలో సార‌థ్యం వ‌హించారు. అనూహ్యం అనుకునే రీతిలో రాజ‌కీయంగా ఎంత‌గానో రాణించారు. ప‌రిణితి ప‌రంగా కొంత లేమి అయితే ఉంది.

అనుభవం ఉన్నా కూడా అప‌రిప‌క్వ రాజ‌కీయాలు చాలా చేశారు. త‌ప్పిదాలు చేశారు. దిద్దుకోలేని కోలుకోలేని త‌ప్పిదాలు కూడా చేసి ఇవాళ ప‌ద‌వీచ్యితుల‌యి, విప‌క్ష నేత హోదాలో ఒంటరిగానే పోరాడుతున్నారు. ఎవ‌రు క‌లిసి వ‌చ్చినా రాకున్నా దుర్గ‌మ దారుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. పార్టీని నిల‌బెట్టేందుకు ప‌రువు నిలుపుకునేందుకు, ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు, అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. ఆ విధంగా ఆయ‌న శ్ర‌మ ఫ‌లిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించ‌డం ఖాయం.

ఇదే స‌మ‌యంలో బీజేపీని ఆ రోజు వ్య‌తిరేకించి త‌ప్పు చేశానా అన్న ఆలోచ‌న‌లో పునరావృతిలో ఉన్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఎన్నోసార్లు ప‌డిపోయారు. కానీ ఆ రోజు ఉన్న‌ప‌రిస్థితుల రీత్యా ఆయ‌న తీసుకున్న తొంద‌ర‌పాటు నిర్ణ‌యం తెలుగుదేశానికి పెద్ద గ్ర‌హ‌ణం అయింది. ఇప్పుడు ఇదే త‌ప్పిదం త‌న శిష్యుడు కేసీఆర్ చేస్తున్నారు. ఆయ‌న కూడా బండ ప‌ద్ధ‌తిలో బీజేపీని వ్య‌తిరేకిస్తున్నారు.

ఆ విధంగా ఆయ‌న త్వ‌ర‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల ఉచ్చులో ప‌డ‌బోతున్నార‌ని సాక్షాత్తూ బీజేపీ వ‌ర్గాలే హెచ్చ‌రిస్తున్నాయి. అంటే ఈడీ ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేయ‌డం ఖాయం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కానీ కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల్లో చోటు చేసుకున్న అవినీతిపై కానీ మ‌రొక ప‌థ‌కం నిర్వ‌హ‌ణ‌పై కానీ కేంద్రం నిఘా వ‌ర్గాల‌ను ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం చేసి ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం ఖాయం అని తేలిపోయింది. క‌నుక గురువు చేసిన త‌ప్పిదాల‌నే శిష్యుడు కూడా చేస్తున్నారా అన్న అనుమానాలు మ‌రోమారు బ‌ల‌ప‌డుతున్నాయి.