Begin typing your search above and press return to search.

తెలంగాణకు అమిత్ షా, బీఎల్ సంతోష్.. టచ్ చేసే ధైర్యం 'సిట్'కు ఉందా?

By:  Tupaki Desk   |   10 Dec 2022 10:30 AM GMT
తెలంగాణకు అమిత్ షా, బీఎల్ సంతోష్.. టచ్ చేసే ధైర్యం సిట్కు ఉందా?
X
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ప్రధాన అనుమానితుడిగా.. వెనుకుండి నడిపించిన కీలక వ్యక్తిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులతో ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయి. సిట్ కూడా ఆయనకు నోటీసులు పంపినా కోర్టుకు ఎక్కి స్టే తెచ్చుకున్నారు. ఎంతగా ఆయనను విచారించాలనుకున్న దొరకలేదు. హాజరుకాలేదు. ఇప్పటికే బీఎల్ సంతోషన్ ను అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు విఫలయత్నాలు చేశారు. కోర్టును ఆశ్రయించారు. అయినా కోర్టు బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని.. నోటీసులపై స్టే ఇచ్చింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముందుకు వెళ్లాలని భావించిన సిట్ అధికారులు కోర్టు ఆదేశాలతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది.అయితే ఇప్పుడు బీజేపీ జాతీయ సమావేశాల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీఎల్ సంతోష్ కూడా హైదరాబాద్ వస్తున్నారు.

ఈనెల 28,29వ తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గ పూర్తిస్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం హైదరాబాద్ లో జరుగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీలో నంబర్ 3గా చెప్పుకునే బీఎల్ సంతోష్ కూడా వస్తున్నారు. ఇక ఈ పరిణామం సిట్ అధికారులకు తలనొప్పిగా తయారైంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చి బీజేపీపై దూకుడుగా వెళ్లాలని పురమాయించారు. స్వయంగా మానిటర్ చేస్తున్నారు. బీఎల్ సంతోష్ ను బుక్ చేయాలని చూసినా ఇప్పటివరకూ ఆ పనిచేయలేకపోయారు.

ఇప్పుడు బీఎల్ సంతోష్ నే స్వయంగా హైదరాబాద్ వచ్చి వెళ్లిపోతే ఇక్కడి ప్రభుత్వానికి, సిట్ కు అవమానంగా భావించాలి. బీఎల్ సంతోష్ ను కేసీఆర్ ఏం చేయలేకపోయాడన్న చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపు సిట్ అధికారులు, ఆయనపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిపుణుల సలహాలు, సూచనలు మేరకు మరోమారు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలకు బీఎల్ సంతోష్ రావడం కేసీఆర్ ముందు తొడగొట్టడానికేనన్న చర్చసాగుతోంది. ఇది కవ్వింపు చర్యగానే టీఆర్ఎస్ చూస్తోంది. మమ్మల్ని ఏం చేయలేరన్న సంకేతాలు ఇవ్వడానికే ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి తెలంగాణ సీఎం కేసీఆర్, సిట్ ఈ విషయం ఏం చేస్తుంది? ఎలాంటి ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాలి. బీఎల్ సంతోష్ ను సిట్ అధికారులు టచ్ చేయగలరా? లేదా? అన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.