Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ ఏమిటో మోడీకి ఇప్పటికైనా అర్థమవుతుందా?

By:  Tupaki Desk   |   21 April 2021 4:30 AM GMT
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ ఏమిటో మోడీకి ఇప్పటికైనా అర్థమవుతుందా?
X
నష్టాలన్నారు.. భరించలేమన్నారు.. అమ్మక తప్పదన్నారు.. ఆ దిశగా అడుగులు వేసి వదిలించుకోవాలని భావించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజున దేశ ప్రజలకు ఊపిరి పోస్తోంది. కరోనా రెండో దశ తీవ్రతరం కావటం.. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న వేళలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో భారీఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ.. దేశ ప్రజలకు ఊపిరి పోస్తోంది విశాఖ ఉక్కు కర్మాగారం. మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో కరోనా చెలరేగిపోవటం.. ఆక్సిజన్ కోసం నానా పాట్లు పడుతున్నారు.

ఈసారి రోగులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువ అవుతోంది. దీంతో.. భారీ డిమాండ్ చోటు చేసుకుంది. తీవ్రమైన కొరతతో పలువురు ప్రాణాలు పోతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలతో విశాఖ ఉక్కు ప్లాంట్ నుంచి రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విశాఖ స్టీల్ పెద్ద ఆదరవుగా మారింది.

ఏపీలో వినియోగించే ఆక్సిజన్ కు సంబంధించి మూడో వంతు ఉత్పత్తి విశాఖ ఉక్కు నుంచే. రాష్ట్రంలోని ఆసుపత్రులకు విశాఖ స్టీల్ నుంచే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరనా కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న మహారాష్ట్రకు 150 టన్నుల ఆక్సిజన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తున్నారు.

విశాఖ ఉక్కులో మొత్తం ఐదు ఆక్సిజన్ ఉత్తత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 2950 టన్నులు. రోజుకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం దీని సొంతం. అంతేకాదు.. 24 గంటలు నిర్విరామంగా ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 100 నుంచి 150 టన్నుల వరకు ద్రవ రూపంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అయితే.. ప్లాంట్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంట్ అవసరాలకు సరిపోతుంది. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో 50-60 టన్నుల ద్రవ రూప ఆక్సిజన్ ను కోవిడ్ ఆసుపత్రులకు ఇతర అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. వదిలించుకోవాలనుకున్న విశాఖ ఉక్కు ఈ రోజున దేశ ప్రజలకు ఊపిరిపోస్తోంది. ఇదే సంస్థ ప్రైవేటు ఏలుబడిలో ఉంటే.. ఆక్సిజన్ కోసం ప్రభుత్వాలు వాటిని సంప్రదించాల్సి ఉండేది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే.. ఎంత లాభమో తాజా ఎపిసోడ్ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.