Begin typing your search above and press return to search.

నిర్మలమ్మ ఈసారైనా కరుణిస్తుందా ?

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:30 AM GMT
నిర్మలమ్మ ఈసారైనా కరుణిస్తుందా ?
X
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి ప్రవేశ పెట్టే బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారైనా ఏపీ ఆశలు ఫలిస్తాయా ? రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇపుడిదే అంశంపై చర్చించుకుంటున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. పోయిన ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ ఆశలకు తగ్గట్లు ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర విభజన సమస్యలు పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అందుకనే తాజా బడ్జెట్లో అయినా ఏపీ ఆశలకు తగ్గట్లు కేటాయింపులు ఉండాలని కోరుకుంటున్నారు. తక్షణమే బడ్జెట్లో నిధులు కేటాయించాల్సినవి పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు భర్తీ చేయటం, 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల లాంటివి చాలానే ఉన్నాయి. ప్రయారిటీగా తీసుకున్నా పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగుంటుంది. సవరించిన అంచనాల ప్రకారం రు. 55,548 కోట్లకు పెట్టుబడుల అనుమతి కావాలని ప్రభుత్వం పదే పదే డిమాండ్ చేస్తోంది.

అలాగే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రు. 10,900 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసుంది. 2014-15 రాష్ట్ర విభజన నాటికి హామీ ఇచ్చిన రెవిన్యు లోటునే కేంద్రం పూర్తిగా మంజూరు చేయలేదు. రెవిన్యు లోటు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన మౌళిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపి అనేకాదు తెలంగాణాను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయంగా అవసరాలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నట్లుంది. ఏపీకి ఎంత నిధులు మంజూరు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని కేంద్రం నిర్ధారణకు వచ్చినట్లుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ఏపి ప్రయోజనాలను నరేంద్ర మోడీ సర్కార్ ఏమీ పట్టించుకోవటంలేదు. కనీసం ఈ బడ్జెట్లో అయినా ఏపీ ప్రయోజనాలను నిర్మలమ్మ పట్టించుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఆమె పట్టించుకుంటారా ?