Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి ‘పీకే’ అవసరమా?

By:  Tupaki Desk   |   8 July 2021 5:30 AM GMT
రేవంత్ రెడ్డికి ‘పీకే’ అవసరమా?
X
రాజకీయాల్లో ఇప్పుడు తమ సొంత తెలివితేటలు, బలం కంటే వ్యూహకర్తల అవసరమే ఎక్కువగా ఉందని పార్టీలు, అధినేతలు భావిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నాడు. తన శక్తి సామర్థ్యాంలో అతివిశ్వాసంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడు సైతం దేశంలోనే ప్రముఖ పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం ప్రయత్నిస్తుంటే రేవంత్ మాత్రం అసలు ఏ ‘పీకే’ అవసరం లేదని కుండబద్దలు కొట్టడం విశేషం.

విశేషంగా తరలివచ్చిన కాంగ్రెస్ అభిమానుల మధ్య బుధవారం పీసీసీ చీఫ్ గా గాంధీభవన్ లో బాధ్యతలు స్వీకరించారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని ప్రకటించారు. ‘తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సేవలను ఉపయోగించుకోవాలని చాలా మంది స్నేహితుల నుంచి నాకు సలహాలు వచ్చాయి. అయితే అలాంటి వ్యక్తులు మనకు నిజంగా అవసరమా? ’ అని కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతి పార్టీ కార్యకర్త ప్రశాంత్ కిషోర్ లాగే శక్తివంతులు అని ఆయన అన్నారు.

‘మాకు చాలా మంది పీకే లు ఉన్నప్పుడు నిజంగా మరొక ‘ప్రశాంత్ కిషోర్’ అవసరమా?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. కాంగ్రెస్ కార్యకర్తలే ఏకే47 బుల్లెట్లలాగా పనిచేస్తారని అభివర్ణించారు. టీఆర్ఎస్ నుంచి గద్దెదించడానికి మేం సరిపోతామని రేవంత్ రెడ్డి నొక్కి వక్కాణించారు.

ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గొప్ప పిలుపునిచ్చాడు. రాబోయే రెండేళ్ల పాటు తమ కుటుంబాలను మరిచిపోయి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తూ విజయంపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రతి కార్యకర్త తన కుటుంబానికి సెలవు ఇవ్వాలని దరఖాస్తు చేయాలి. మనం రెండేళ్లు కష్టపడి పనిచేయాలి. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

పార్టీకి బలమైన నాయకత్వం ఉంటే అధికారంలోకి రావడం కష్టం కాదని కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులున్నారు. ఆందోళన చెందడానికి ఏమీ లేదని’ స్పష్టం చేశారు.

దీన్ని బట్టి పీకేలాంటి రాజకీయ వ్యూహకర్తల జోలికి వెళ్లకుండా కష్టపడి పనిచేసి అధికారంలోకి రావడంపైనే రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది వేచిచూడాలి.