Begin typing your search above and press return to search.

నెల్లూరులో త‌మ్ముళ్ల దూకుడు తగ్గిందా..?

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:31 PM GMT
నెల్లూరులో త‌మ్ముళ్ల దూకుడు తగ్గిందా..?
X
ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో ఒక‌ప్పుడు దూకుడు మీదున్న టీడీపీ రాజ‌కీయాలు ఇటీవ‌ల కాలంలో త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఇంత‌కు ముందు ఉన్న జోరు, హోరు ఇక్క‌డ నాయ‌కుల్లో క‌నిపించ‌డం లేదు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాగానే ప‌నిచేసిన ఇక్క‌డ నాయ‌కులు అనంత‌రం, పార్టీ కార్య‌క్ర‌మాల్లోను, వ్య‌క్తి గ‌తంగా చంద్ర‌బాబు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. వాస్త‌వానికి బీద సోద‌రు లు ఇద్ద‌రూ కూడా క‌లిసి కార్య‌క్ర‌మాలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

మ‌స్తాన్‌రావు జంప్ చేయ‌డంతో ర‌విచంద్ర‌యాద‌వ్ ఒక్క‌రే పార్టీలో ఉన్నారు. కానీ, ఆయ‌న పెద్ద‌గా పార్టీలో ప‌నిచేయలేక పోతున్నార‌నేవాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కు ముందు ర‌విచంద్ర అంతా తానే చ‌క్రం తిప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌రోవైపు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కూడా.. పార్టీ త‌ర‌ఫున బాగానే వాయిస్ వినిపించేవారు. ఇటీవ‌ల కాలంలో ఈయ‌న కూడా కేవ‌లం అంశాల వారీ రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు.

అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి వ‌చ్చేస్తారు.. టీడీపీలో చేర‌తారు.. అనుకున్న నాయ‌కులు కూడా అక్క‌డే బాగుంద‌న్న‌ట్టుగా త‌మ‌త‌మ ప్ర‌య‌త్నాలు విర‌మించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం కుటుంబం గ‌తంలో ఒక‌రిద్ద‌రు టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే ప్ర‌చారం ఉండేది. కానీ, ఇటీవ‌ల కాలంలో చూస్తే.. ఈ ఊసు వినిపించ‌డం లేదు. స‌ర్వేప‌ల్లి, వెంక‌ట‌గిరి, నెల్లూరు రూర‌ల్, నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప్ర‌స్తావ‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ ఇక్క‌డ డౌట్లే క‌నిపిస్తున్నాయి.

గ‌తంలో ఉన్న దూకుడు ఇక్క‌డ ఇటీవ‌ల కాలంలో క‌నిపించ‌డం లేదు. నాయకులు ఇంత‌కుముందు ప్ర‌త్య‌ర్థి నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి అయితే, ఇప్పుడు మాత్రం ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీనికి కార‌ణం.. కేసులు పెట్ట‌డ‌మో.. అరెస్టు చేయ‌డ‌మో కాద‌ని, పార్టీలో ఒక‌ర‌క‌మైన నిస్తేజం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌లకు ఇంకా చాలానే స‌మ‌యం ఉంద‌ని.. అప్పుడు చూసుకుందామ‌ని నాయ‌కులు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే పార్టీలో జోష్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.దీనిపై ఇటీవ‌ల చంద్ర‌బాబు దృష్టిపెట్టార‌ని, నాయ‌కుల‌ను హెచ్చ‌రించార‌ని ఉండ‌వ‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.