Begin typing your search above and press return to search.

తాగునీటితో కరోనా వస్తుందా? ఏది నిజం.. ఏది అపోహ?

By:  Tupaki Desk   |   3 May 2021 2:30 AM GMT
తాగునీటితో కరోనా వస్తుందా? ఏది నిజం.. ఏది అపోహ?
X
కొవిడ్ మహమ్మారి రోజురోజుకూ జడలు చాస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ వైరస్ పై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అంశాలు సామాన్యులను తికమకపెడుతున్నాయి. సొంత వైద్యం పేరిట అనేక ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేనిపోని అపోహలతో మానసికంగా కుంగిపోతున్నారు. వైరస్ అపోహలు, నిజాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. వాటిపై ఆరోగ్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

ఎవరో చెప్పారని ఇష్టానుసారంగా మందులు వాడడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. మంచినీటితో కరోనా వ్యాపించదు. వైరస్ తో కలిసి నీళ్లు తాగడం వల్ల మహమ్మారి బారిన పడే అవకాశాలు లేవు. ఈత కొలనులో కరోనా బాధితుడితో కలిసి ఈదితే వైరస్ సోకే అవకాశం ఉంది. రెమిడెసివర్ ఇంజక్షన్ వల్ల వైరస్ పూర్తిగా పోదు. కేవలం వ్యాప్తిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. వీటి వాడకంపై వైద్యులదే తుది నిర్ణయం.

ఇంటి వైద్యం పేరిట ముక్కులో నిమ్మరసం వంటి సాహసాలు చేయొద్దు. వేడి నీళ్లు తాగితే కరోనా రాదనేది అపోహనే. వేడి నీళ్లతో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ వైరస్ ను చంపేయగలం అనేది అవాస్తవం. 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వైరస్ క్షీణిస్తుంది. కానీ మానవ శరీర ఉష్ణోగ్రత 36 డిగ్రీలు మాత్రమే. కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి, ఇతర సమస్యలు ఉంటే మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే ఇంట్లో ఉండే వైరస్ ను ఎదుర్కోవచ్చు.

ఇతర వ్యాధులకు ఇచ్చే టీకాలు కరోనాపై ప్రభావం చూపుతాయా? అనే అంశంపై పరిశోధనలు జరిగాయి. అవి ఏమాత్రం పనిచేయవని అధ్యయనాల్లో వెల్లడైంది. గర్భస్థ శిశువుకు తల్లినుంచి వైరస్ సోకదు. బయటకు వచ్చాక ఇతర రోగుల నుంచి సోకే ప్రమాదం ఉంది. తల్లి పాలతోనూ వైరస్ రాదు. ఎన్-95 మాస్క్ ధరించి శిశువుకు పాలు పట్టవచ్చు. టీకా రెండు డోసుల అనంతరం వైరస్ పై ప్రభావం చూపగలుగుతుంది. కొవిడ్ పై లేనిపోని అపోహలు నమ్మకుండా ఇంట్లోనే ఉంటూ మంచి ఆహారం తీసుకోవాలి. వైరస్ సోకిన ధైర్యంగా ఉంటే సులభంగా జయించవచ్చని కరోనా విజేతలు చెబుతున్నారు.