Begin typing your search above and press return to search.

ఏపీలో మీడియా అలా చేస్తుందా? ఐఐఎం సంచలన నివేదిక

By:  Tupaki Desk   |   30 Aug 2020 8:03 AM GMT
ఏపీలో మీడియా అలా చేస్తుందా? ఐఐఎం సంచలన నివేదిక
X
వాస్తవాల్ని వాదనల రూపంలో మార్చి వార్తలుగా రూపంలో అందిస్తే ఏమవుతుంది? దాని సమాధానం ఇప్పుడు ఏపీకి చెందిన వార్తల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఉన్నది ఉన్నట్లుగా సమాచారాన్ని అందించటానికి బదులుగా.. ప్రతి విషయంలోనూ తమ ప్రత్యర్థులపైనో.. తాము టేకప్ చేసిన పొలిటికల్ పార్టీకి తగ్గట్లుగా అక్షరాల్ని కూర్చేయటం చాలామందికి ఒక అలవాటుగా మారింది. దీంతో వాస్తవాలు మరుగన పడుతున్నాయి. అర్థ సత్యాలు.. అనవసరమైన మాటలు నిజాలుగా ప్రజల మనసుల్లోకి వెళ్లి మరిన్ని వికారాలకు తెర తీస్తోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వానికి ఐఐఎం అహ్మదాబాద్ టీం ఒక నివేదికను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అందించారు. అందులో పలు అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? లాంటివి. అవన్నీ బోర్ కాబట్టి.. వాటిని వదిలేద్దాం. ఇక.. మీడియా సంగతికి వద్దాం. మీడియాను ఉద్దేశించి ఏమని పేర్కొన్నారంటే.. పాలనా వ్యవహారాల్లో మాఫియా.. రాజకీయనేతలతో పాటు మీడియా జోక్యాన్ని కూడా దూరం పెట్టాలన్నారు.

అవినీతి నిర్మూలనకు మీడియాను కూడా దూరం పెట్టాలని చెప్పటంతోపాటు.. అవినీతిలో మీడియాకు చెందిన వారి ప్రమేయం కూడా ఉందని చెప్పుకొచ్చారు. మీడియా అంటే.. పచ్చ మీడియా.. నీలి మీడియా.. పాలరోజా మీడియా ఇలా అన్నింటి సమాహారమే తప్పించి.. కొంతమందికి మినహాయింపు ఇచ్చి.. మరికొన్నింటిని బాధ్యులుగా చేయలేదన్నది మర్చిపోకూడదు. కానీ.. కొందరు మేధావులు మాత్రం తమకు నచ్చిన మీడియా సంస్థల పేర్లను ప్రస్తావించకుండా.. తాము వ్యతిరేకించే సంస్థల పేర్లను చేర్చేసి.. న్యాయమూర్తి స్థానంలో కూర్చొని తీర్పులు ఇచ్చేయటం షురూ చేశారు.

దీంతో వచ్చే నష్టం ఏమిటంటే.. కొన్ని మీడియా సంస్థలు సత్యహరిశ్చంద్రుని వంశీకులుగా.. మరికొందరు అబద్ధాలకు పుట్టి.. పెరిగిన వారిగా అభివర్ణించటం సరికాదు. ఐఐఎం అహ్మదాబాద్ లాంటి టీం ఒక రిపోర్టు ఇస్తే.. దాన్లో ఉన్న అంశాలకు తమకు తోచినట్లుగా రాసేయటం వల్ల కొత్త అపోహలు.. అపనమ్మకాలు పెరుగుతాయన్నది మర్చిపోకూడదు.