Begin typing your search above and press return to search.

టీటీడీకి ఈ వివాదాలు అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 6:36 AM GMT
టీటీడీకి ఈ వివాదాలు అవ‌స‌ర‌మా?
X
ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌కు నిత్యం కొన్ని వేల మంది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఒక్క రోజులో ల‌క్ష మంది భ‌క్తులు ద‌ర్శించుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. వీరింద‌రికీ సేవ‌లు అందించ‌డానికి, స్వామి వారి సేవ‌ల‌కు సంబంధించిన కార్య‌క‌లాపాలు, దేవ‌స్థానం కార్య‌క్రమాలు నిర్వ‌హించడానికి ప్ర‌త్యేకంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బోర్డు ఉంది. దీనికి ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా ఉన్నారు. ఇంకా టీటీడీ చైర్మ‌న్‌, వివిధ విభాగాల‌కు సంబంధించి వేల మంది సిబ్బంది కూడా ఉన్నారు.

అయితే.. భ‌క్తులకు కావాల్సిన సేవ‌లు, సౌక‌ర్యాలపైన దృష్టిపెట్టాల్సిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బోర్డు అన‌వ‌స‌ర వివాదాల్లో త‌ల‌దూరుస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తిరుమ‌ల కొండ‌ల మీద ఏడుకొండ‌ల‌వాడి నామ త‌ప్ప మ‌రేదీ విన‌ప‌డ‌కూడ‌దు. కానీ నిత్యం అనేక వివాదాలు, ర‌చ్చ న‌డుస్తున్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా సినీ న‌టి అర్చనా గౌత‌మ్ సంగ‌తిని విమ‌ర్శ‌కులు గుర్తు చేస్తున్నారు. గ‌తంలో కొండ‌పైన‌ ప‌లుమార్లు అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ప‌లుమార్లు శ్రీవారి భ‌క్తులు అన్య‌మ‌త ప్ర‌చారం చేస్తున్న వ్య‌క్తుల‌ను ప‌ట్టుకుని అధికారుల‌కు కూడా అప్ప‌గించారు. వాస్త‌వానికి టీటీడీలో ప‌నిచేసేవారిలో పెద్ద మొత్తంలోనే అన్య మ‌త‌స్తులు ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి.

అయితే ఎప్ప‌టిక‌ప్పుడు టీటీడీ ప్ర‌జా సంబంధాల విభాగం (పీఆర్వో) ఈ విమ‌ర్శ‌ల‌ను, ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ వ‌స్తోంది. ఇటీవ‌ల ఒక మ‌హారాష్ట్ర భ‌క్తుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హంతో కారులో తిరుమ‌ల‌కు బ‌య‌లుదేరాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అలిపిరి ద‌గ్గ‌రే వెన‌క్కి తిప్పి పంపారు. మ‌హారాష్ట్రీయులు ఛ‌త్ర‌ప‌తి శివాజీని ఆరాధిస్తారు. కారులో శివాజీ విగ్ర‌హం ఉండ‌టం వ‌ల్ల టీటీడీకి వ‌చ్చిన న‌ష్ట‌మేంటో గానీ అత‌డిని తిరుమ‌ల‌కు పోనీయ‌లేదు. దీంతో అత‌డు సెల్పీ వీడియో తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో మ‌హారాష్ట్ర అంతా వైర‌ల్‌గా మారింది. దీంతో మ‌హారాష్ట్రీయులు టీటీడీపైన భ‌గ్గుమ‌న్నారు.

దీంతో టీటీడీ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగాల్సి వ‌చ్చింది. మ‌హారాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తిరుమ‌ల‌లో స‌న్మానం చేసి.. ఛ‌త్ర‌ప‌తి శివాజీ అంటే త‌మకు గౌర‌వ‌ముంద‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు సినీ న‌టి అర్చ‌నా గౌత‌మ్ విష‌యంలోనూ టీటీడీయే రచ్చ చేసుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆమె ఎవ‌రిదో ప్ర‌జాప్ర‌తినిధి రిక‌మండేష‌న్ లెట‌ర్ తెచ్చింది. ఆ లెట‌ర్ ప్ర‌కారం ద‌ర్శ‌నానికి గ‌డువు తీరిపోయింది. ఇదే విష‌యాన్ని ఆమెకు అర్థ‌మ‌య్యేలా చెప్పి ఉంటే స‌రిపోయేది. అయితే టీటీడీ ఉద్యోగులు ఆమెతో దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆమె కూడా అంతే ధీటుగా స్పందించార‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో అర్చనా గౌత‌మ్ ఒక వీడియో పెడితే.. ఆమె టీటీడీ ఉద్యోగిని కొట్టిందంటూ టీటీడీ ఒక వీడియో రిలీజ్ చేసింది.

అలాగే వివిధ అంశాల‌పై టీటీడీపై విమ‌ర్శ‌లు చేసేవారిపై కేసులు వేస్తామ‌ని టీటీడీ బెదిరిస్తోంద‌ని అంటున్నారు. విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం లేకుండా ఎవ‌రైనా స‌మ‌స్య‌ను లేవ‌నెత్తిన‌ప్పుడే స‌రిచేసుకుంటే ఈ స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల తాను ఉన్న గ‌దికి తిరిగి కాష‌న్ డిపాజిట్ ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించినందుకు టీడీపీ నేత బీటెక్ ర‌విపై కేసు పెట్టార‌ని పేర్కొంటున్నారు. అలాగే రాధామ‌నోహ‌ర్ దాస్ స్వామీజీ టీటీడీపై అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆయ‌న అడిగే వాటికి జ‌వాబు చెప్ప‌లేక ఆయ‌న‌పైనా కేసులు న‌మోదు చేస్తామ‌ని టీటీడీ హెచ్చ‌రిస్తోంది.

అంద‌రికీ ఒక లెక్క‌.. పాల‌క‌ప‌క్షం అయితే ఇంకో లెక్క అన్న‌ట్టు టీటీడీ వ్య‌హ‌రిస్తోంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల వైఎస్సార్సీపీ మంత్రులు సీదిరి అప్ప‌ల‌రాజు, ఉష‌శ్రీ చ‌ర‌ణ్, ఆర్కే రోజా త‌దిత‌రులు మందీమార్బ‌లంతో తిరుమ‌ల‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన సంగతి తెలిసిందే. త‌మ‌వారంద‌రికీ బ్రేక్ ద‌ర్శ‌నాలు క‌ల్పించాల్సిందేన‌ని, సేవా టికెట్లు ఇవ్వాల్సిందేన‌ని వైఎస్సార్సీపీ నేత‌లు ఆదేశించ‌డం.. టీటీడీ పాటించ‌డం జ‌రిగిపోయాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు భ‌క్తులు న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నా ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపణలున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.