Begin typing your search above and press return to search.

యజమానిని రక్షించటం కోసం పులితో ఫైట్ చేసిన కుక్క

By:  Tupaki Desk   |   7 Jun 2016 4:54 AM GMT
యజమానిని రక్షించటం కోసం పులితో ఫైట్ చేసిన కుక్క
X
నమ్మటం కష్టమే కానీ.. ఇది వాస్తవం. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క.. తన యజమానిని రక్షించాలన్న ప్రయత్నంలో పులితో ఫైటింగ్ కు సైతం సై అనటమే కాదు.. దాంతో పెద్ద ఎత్తున పోరాడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి వారంతా ఈ ఉదంతం గురించి ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. వీధుల్లో తిరిగే ఒక కుక్కను దుద్వా జాతీయ పార్క్ సమీపంలోని బార్ బత్ గ్రామానికి చెందిన గురుదేవ్ సింగ్ అనే రైతు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. జాకీ అని పిలుచుకుంటూ ప్రేమతో సాకేవాడు. కుక్కతో కలిసి నిద్రిస్తున్న వేళ.. అక్కడికి ఒక పులి వచ్చింది.

ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన జాకీ వెంటనే రియాక్ట్ కావటమే కాదు.. పెద్ద ఎత్తున అరుస్తూ యజమానిని అలెర్ట్ చేసింది. అక్కడికి వచ్చిన పులితో ఫైటింగ్ కు దిగింది. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఫైటింగ్ నడిచింది. జాకీ అరుపులతో మేల్కొన్న యజమాని గురుదేవ్ కట్టె పట్టుకొని పులి మీదకు దాడి చేసే ప్రయత్నం చేశారు.

అయితే.. గురుదేవ్ ను స్వల్పంగా గాయపర్చిన పులి.. జాకీని మాత్రం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. కొద్దిదూరంలోనే కుక్కను వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. పులితో పోరాడిన జాకీ చనిపోయింది. విశ్వాసానికి మారుపేరులా నిలిచిన జాకీ మరణాన్ని అక్కడి వారు తట్టుకోలేకపోయారు. తీవ్ర విషాదంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కంటికి రెప్పలా చూసుకున్న జాకీ తన ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణ త్యాగం చేసిందంటూ యజమాని చెబుతున్నాడు.