Begin typing your search above and press return to search.

భద్రాద్రి జిల్లాకు చెందిన కుక్కలు ఎలా సేవ్ చేశాయంటే?

By:  Tupaki Desk   |   20 Dec 2019 11:49 AM IST
భద్రాద్రి జిల్లాకు చెందిన కుక్కలు ఎలా సేవ్ చేశాయంటే?
X
విన్నంతనే నమ్మలేనట్లుగా అనిపించినా.. ఇది నిజం. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గంగదేవిపల్లికి చెంది బక్కయ్య అనే వ్యక్తి రెండు కుక్కల్ని పెంచుతున్నాడు. ఉలవ పంటకు రోజూ కాపలాగా వెళుతుంటాడు. తనతో పాటు తాను పెంచుకునే కుక్కల్ని వెంట తీసుకెళ్లటం అతనికి అలవాటు.

రోజూ మాదిరే నిన్న (గురువారం) కూడా ఉదయాన్నే తనతో పాటు పొలానికి బయలుదేరాడు. పొగమంచు బాగా పట్టి ఉండటంతో పొలానికి వెళ్లిన అతడు.. అక్కడే ఉన్న ఎలుగుబంటిని చూసుకోలేదు. చేనులో ఉన్న కోతుల్ని తోలుతున్న అతనిపై ఎలుగుబంటు ఒక్కసారిగా దాడి చేసింది. అతడి కేకలు విన్నంతనే రెండు కుక్కలు సివంగిలా ఎలుగుబంటి పైకి విరుచుకుపడ్డాయి.

దాంతో అది అడవిలోకి పారిపోయింది. అప్పటికే ముఖం మీద తీవ్ర గాయాలైన బక్కయ్యకు ఒక కుక్క కాపలాగా నిలిస్తే.. మరో కుక్క అరుచుకుంటూ ఇంటికి వెళ్లి వారిని పొలానికి తీసుకొచ్చింది. కుక్క పనితో అనుమానం వచ్చి ఇంట్లోవారు దాని వెంట రాగా.. గాయాలతో పడి ఉన్న బక్కయ్య కనిపించాడు.

వెంటనే అతన్ని పాల్వంచ ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. ఆసుపత్రిలో కోలుకున్న బక్కయ్య తన ప్రాణాల్ని కాపాడింది తాను పెంచుకున్న రెండు కుక్కలే అని చెప్పుకొచ్చాడు. కుక్కలు చేసిన పనికి గ్రామస్తులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. రీల్ లో కనిపించే ఇలాంటి సీన్ రియల్ గా చోటు చేసుకోవటం విశేషం.