Begin typing your search above and press return to search.

వామ్మో : ప్రచారానికి కుక్కల్ని కూడా వాడేసుకుంటున్నారే .. ఎక్కడ ?

By:  Tupaki Desk   |   10 April 2021 11:30 AM GMT
వామ్మో : ప్రచారానికి కుక్కల్ని కూడా వాడేసుకుంటున్నారే .. ఎక్కడ ?
X
ఎన్నికల ప్రచారం సమయంలో బహిరంగ సభలు, వాహనాలపై ర్యాలీలు, పాదయాత్రలు, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుంటారు రాజకీయ నేతలు. ప్రజలను ఓట్లు అడిగేందుకు అవి మంచి మార్గాలే. కానీ... కుక్కకు ఎన్నికల ప్రచార పోస్టర్ అంటించడం ఎక్కడనా చూశారా.. కుక్కకి పోస్టర్ ఏంటి రా బాబు అనుకుంటున్నారా , అవును కుక్కకి ఎన్నికల పోస్టర్ తగిలించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. అక్కడి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా ఉంది. కరోనా భయంతో కొత్తగా ప్రచారం చేయాలనుకున్నారు. అక్కడి వీధుల్లో ఊర కుక్కలు ఎక్కువ. అవి అలా వేస్టుగా ఉన్నాయని భావించిన రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు , కుక్కల నడుముకి ప్రచార పోస్టర్లు అంటించారు. తమకే ఓటు వెయ్యాలని పోస్టర్లపై కోరారు.

దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మీరు మనుషులేనా మీకు బుద్ధుందా అని వన్యప్రాణుల ప్రేమికులు ఫైర్ అయ్యారు. అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విమర్శలు వస్తున్నా, తాము చేసిన పనిని సమర్థించుకుంటున్నారు అభ్యర్థులు. ఏ గోడలపైనో అంటిస్తే, ఎవరూ చూడట్లేదట. అదే కుక్కలపై అంటిస్తే, అందరి దృష్టీ పడుతుందనీ, అలాగైనా తమ పోస్టర్లు చూస్తారని ఇలా చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. తాము ఏ కుక్కలకూ హాని చెయ్యట్లేదనీ జస్ట్ పోస్టర్ అంటించి, కుక్కలకు తామే ఆహారం కూడా వేస్తున్నామని చెప్పుకుంటున్నారు. పైగా ప్రజలు తమ ఐడియాను స్పాగతిస్తున్నారనీ చెప్తున్నారు. కొత్త ప్రచారం పేరు చెప్పి... కుక్కలపై పోస్టర్లు అంటించడమేంటని జంతు హక్కుల పోరాట యోధురాలు రీనా మిశ్రా ఫైర్ అయ్యారు. ఎవరైనా సదరు అభ్యర్థి ముఖంపై పోస్టర్ అంటిస్తే, ఆ అభ్యర్థికి ఎలా ఉంటుంది అని ఆమె ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగబోతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 15న జరగనున్నాయి. మిగతావి ఏప్రిల్ 19, 26, 29న జరుగుతాయి. మే 2న ఫలితాలు వస్తాయి.