Begin typing your search above and press return to search.

పురంధేశ్వరికి డొక్కా కౌంటర్

By:  Tupaki Desk   |   5 Nov 2015 9:34 AM GMT
పురంధేశ్వరికి డొక్కా కౌంటర్
X
వారిద్దరూ కాంగ్రెస్ మాజీ మంత్రులే. ఒకరు రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తే ఇంకొకరు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. విభజన అనంతర పరిణామాల్లో కాస్త ముందూవెనకగా వారు కాంగ్రెస్ ను వీడారు. ఒకరు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కాగా ఇంకొకరు రాష్ట్ర మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. పురంధేశ్వరి ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ - డొక్కా ఉన్న టీడీపీ మిత్రపక్షాలు. అయితే... బీజేపీ మాత్రం మిత్రధర్మం మరచి టీడీపీని, మరీ ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న చిన్నాచితకా నేతలే కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన పురంధేశ్వరి, కావూరి వంటివారూ చంద్రబాబును నిత్యం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ పురంధేశ్వరి తీరును ఎండగట్టారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైన విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలకు డొక్కా కౌంటర్ ఇచ్చారు. మిత్ర ధర్మానికి విరుద్ధంగా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బిజెపి నేతలు చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు.

రాజకీయంగా ఉనికి లేనప్పుడే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజకీయ నేతలా కాకుండా కాగ్ ప్రతినిధిగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాయలసీమ విషయంలో మరోసారి తప్పటడుగులు వేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ - బిజెపిలకు డొక్కా విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవల బిజెపి నేతలు ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాసిన వివాదాస్పద పుస్తకావిష్కరణలో పురంధేశ్వరి పాల్గొన్నారు. జోగయ్య పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి - బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో టిడిపికి ఆదరణ తగ్గుతోందని కావూరి సాంబశివ రావు అన్నారు. ఈ నేపథ్యంలో డొక్కా బిజెపి నేతల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి టీడీపీపై బాణాలు వేస్తున్నవారిని ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారినే ఎంచుకున్నట్లుంది. ఈ లెక్కన రాయపాటి కూడా తన మాజీ సహచరులపై విరుచుపడతారేమో చూడాలి.