Begin typing your search above and press return to search.

ప్యాకేజీ కోరాలి అంటున్న టీడీపీ నాయ‌కుడు

By:  Tupaki Desk   |   4 Sep 2016 8:27 AM GMT
ప్యాకేజీ కోరాలి అంటున్న టీడీపీ నాయ‌కుడు
X
మాజీ మంత్రి - టీడీపీ నాయ‌కుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీపై కొత్త కామెంట్ వినిపించారు. ప్ర‌తిపక్షాలు ప్యాకేజీ వద్దనడం తగదని డొక్కా అన్నారు. ముందుగా కేంద్రం ఇచ్చే ప్యాకేజీ తీసుకుని ఆ తరువాత హోదా కోసం పోరాడాలని స‌ల‌హా ఇచ్చారు. విజయవాడలోని టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదాపై అనేకసార్లు ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారన్నారు. ఈ విషయంలో ప్రజల సెంటిమెంట్‌ రెచ్చగొట్టడం సరైన విధానం కాదని హితవు పలికారు. ప్రతి అభివృద్ధి పనికీ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

మ‌రోవైపు ప్రత్యేక హోదా-ప్యాకేజీ అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌ తులసిరెడ్డి ఘాటుగా స్పందించారు. ప్ర‌త్యేక హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని, విభజన చట్టంలోని అంశాల్లో ఒక్క రూపాయి తగ్గినా ఊరుకునే ప్రసక్తి లేదని ఆయ‌న హెచ్చరించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు మించిన సాయం ఆంధ్రప్రదేశ్‌ కు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వెంక‌య్య‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తుల‌సిరెడ్డి అన్నారు. హోదా అంశాన్ని విభజన సమయంలో తేల్చకుండా కేవలం నోటి మాటతో సరిపెట్టారని మాట్లాడటం సరికాదన్నారు. విభ‌జ‌న సంద‌ర్భంగా ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన ప్రకటనపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ పరిశ్రమల స్థాపనకు ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని కోరారని తుల‌సిరెడ్డి గుర్తు చేశారు. ఇదే అంశాన్ని బిజేపి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చిందన్నారు. హోదాపై మొదటి నుంచి మాట మారుస్తూ వస్తున్న వెంకయ్య నాయుడు పదేళ్లు హోదా కావాలని ఎందుకు అడిగారని తుల‌సిరెడ్డి ప్రశ్నించారు. హోదాపై నాటి యూపిఏ ప్రభుత్వం 2014 మార్చి 1న మంత్రి వర్గంలో తీర్మానం చేసి, అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని కూడా ఆదేశించిందని, ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆదేశాలు అమలు కాలేదని చెప్పుకొచ్చారు.