Begin typing your search above and press return to search.

డొక్కా వ‌ర్సెస్ గ‌ల్లా.. అస‌లేం జ‌రిగింది..?

By:  Tupaki Desk   |   8 July 2019 6:05 AM GMT
డొక్కా వ‌ర్సెస్ గ‌ల్లా.. అస‌లేం జ‌రిగింది..?
X
అసెంబ్లీ - పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితులు ద‌రిదాపుల్లో కూడా క‌నిపించ‌డం లేదు. పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నాయి. నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌పోరు రాజుకుంటోంది. ఒట‌మిపై ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ ప‌రిస్థితి గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ ప్ర‌సాద్‌ కు - గ‌ల్లా కుటుంబం మ‌ధ్య వ‌ర్గ‌పోరు భ‌గ్గుమంటోంది. త‌న ఓట‌మికి గ‌ల్లా అరుణ‌కుమారే కార‌ణ‌మ‌ని డొక్కా మండిప‌డుతున్నారు. ఈ మేర‌కు పార్టీ అధినేత చంద్ర‌బాబు దృష్టికి కూడా విష‌యాన్ని ఆయ‌న తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

నిజానికి.. మొన్న‌టి ఎన్నిక‌ల్లో డొక్కా తాడికొండ సీటును కోరుకున్నార‌ట‌. కానీ.. అనేక ప‌రిణామాల మ‌ధ్య ఆయ‌నకు చంద్ర‌బాబు ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించారు. తాడికొండ‌లో డొక్కా గ‌తంలో రెండుసార్లు గెల‌వ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాడికొండ నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పినా బాబు అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్‌ కుమార్‌ కే సీటు ఇచ్చారు. దీంతో డొక్కా అయిష్టంగానే త‌న‌కు ప‌ట్టులేని ప్ర‌త్తిపాడులో పోటీ చేసి ప్ర‌స్తుత హోం మంత్రి సుచ‌రిత చేతిలో ఓడిపోయారు.

అయితే.. అప్ప‌టి వ‌ర‌కు నియోజ‌వ‌ర్గం పార్టీలో మూడు నాలుగు వ‌ర్గాలు ఉండేవి. మాజీమంత్రి రావెల - కందుకూరు వీరయ్య - మాకినేని పెదరత్తయ్య - ఎంపీ గల్లా వర్గాలతో పార్టీ ఆగ‌మాగం ఉందేద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతుంటారు. డొక్కా వ‌చ్చిన త‌ర్వాత‌నే పార్టీ శ్రేణులంద‌రూ ఒక్క‌ తాటి పైకి వ‌చ్చార‌ని - నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లం పెరిగింద‌ని అంటుంటారు. త‌న‌కు ఇష్టం లేని నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించినా.. తాను నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేశాన‌ని - అంద‌రికీ ఒక్క‌ తాటి పైకి తీసుకొచ్చాన‌ని అంటుంటారు డొక్కా.

ఈ ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారినే కార‌ణ‌మని డొక్కా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి.. కానీ.. ఎంపీకి మాత్రం టీడీపీకే వేయండి.. అంటూ అరుణకుమారి ప్ర‌చారం చేశారని.. త‌న‌ను ఓడించేందుకే.. కుట్రపూరితంగానే గల్లా ఇలాంటి ప్రచారం చేశారని డొక్కా ఆగ్ర‌హంతో ఊగిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా ఆయ‌న తీసుకెళ్లారు. అయితే.. చంద్ర‌బాబు నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో.. డొక్కా మ‌రింత అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. గ‌ల్లా అరుణ‌కుమారి కూడా ప‌రిస్థితిని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ప్ర‌త్తిపాడులోనే ఉండ‌డంతో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరు.. చంద్ర‌బాబుకు మ‌రింత ఇబ్బందిగా మారింద‌ట‌. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిపోయిన పార్టీని కాపాడుకుంనేందుకు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్న చంద్ర‌బాబుకు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ఈ ప‌రిస్థితులు మ‌రింత త‌ల‌నొప్పిగా మారాయ‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. మ‌రి.. గ‌ల్లా - డొక్కా వ‌ర్గపోరును చంద్ర‌బాబు ఎలా చ‌ల్లార్చుతారో చూడాలి.