Begin typing your search above and press return to search.

చైనాతో యుద్ధానికి రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:58 PM GMT
చైనాతో యుద్ధానికి రంగం సిద్ధం
X
చైనాతో ఏ క్షణాన యుద్ధం వచ్చినా అందుకు సర్వసన్నద్ధంగా ఉండేందుకు ఇండియా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో భారత పౌరులకు వీసమెత్తు హాని కూడా కలగకూడదనే ఉద్దేశంతో సరిహద్దుల్లోని పలు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. దీంతో యుద్ధం తప్పదా అన్న ఆందోళన అంతటా కనిపిస్తోంది. మరోవైపు గ్రామాలను ఖాళీ చేయించడం ద్వారా యుద్ధానికి తామేమీ భయపడడం లేదన్న సంకేతాలు చైనాకు పంపించడం కూడా ప్రభుత్వ ఉద్దేశం కావొచ్చని తెలుస్తోంది.

భారత - చైనాల మధ్య రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డోక్లామ్‌ విషయంలో తలెత్తిన ఈ వివాదం యుద్ధవాతావరణానికి దారి తీస్తుండడంతో అక్కడికి సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తోంది. తాజాగా నథాంగ్‌ అనే గ్రామంలో ప్రజలందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అదేసమయంలో వేలాది మంది సైనికులను అక్కడ మోహరిస్తోంది. పలు ఇతర గ్రామాలను కూడా ఒకటిరెండు రోజుల్లో ఖాళీ చేయించే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఇదంతా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చేపడుతున్న చర్యలుగానూ చెప్పుకోవచ్చు. యుద్ధం జరిగితే అనవసరంగా ఆ ప్రాంతా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా చైనా సరిహద్దుల్లోని గ్రామాలు - ఇతర సరిహద్దు ప్రాంతాలను చేరుకునేందుకు వీలుగా అన్ని మార్గాలను కూడా ఆటంకాల్లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తిప్పికొట్టేందుకు ఆర్మీ సిద్ధమవుతోంది. మరోవైపు ఆర్మీకి అత్యవసరంగా రూ. 20వేల కోట్లు కేటాయించాలంటూ రక్షణశాఖ.. కేంద్ర ఆర్థికశాఖను కోరింది. ఇదంతా యుద్ధవాతావరణాన్ని చెప్పకనే చెప్తున్నాయి.